Thursday, April 25, 2024

ఆర్టీసీ బ‌త‌కాలంటే చార్జీల భారం త‌ప్ప‌దు.. త్వ‌ర‌లోనే మ‌రింత‌ పెంపు ఉంటుంద‌న్న బాజిరెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రౌండప్‌, సెస్‌ల పేరుతో ప్రయాణికులపై ఆర్టీసీ తాజాగా విధించిన చార్జీల పెంపు భారం కేవలం కొసరు మాత్రమేనని, త్వరలోనే అసలు వడ్డింపులు ఉంటాయని ఆర్టీసీ చైర్మన్‌ భాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత పెంపు సంస్థ తీసుకున్న నిర్ణయమని, ఈ పెంపుతో ప్రభుత్వానికేం సంబంధం లేదన్నారు. సంస్థ బతికి బట్టకట్టాలంటే చార్జీలు పెంచాల్సిందేనని, త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయనుందని తేల్చి చెప్పారు. ఉప్పల్‌ నుంచి యాదాద్రి దేవాలయానికి ఆర్టీసీ మినీ బస్సులను ప్రారంభించింది. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌ ప్రాంతంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ బస్సులను సంస్థ ఎండీతో కలిసి చైర్మన్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం పెరిగిన చార్జీలు ప్రభుత్వం పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఈ పెంపు అనివార్యమైందన్నారు. టోల్‌గేట్లకు చెల్లింపుల ద్వారా సంస్థ ఏటా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు నష్టపోతుందన్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు టోల్‌గేట్లు ఉన్న మార్గాలలో టోల్‌ చార్జీలను పెంచామన్నారు. ప్రయాణికులపై ఇన్ని రకాల చార్జీలను పెంచినప్పటికీ సంస్థ రోజుకు రూ.6 కోట్ల వరకు నష్టాలను చవిచూస్తోందని పేర్కొన్నారు. సంస్థను కాపాడుకోవాలంటే కొద్ది మేర చార్జీలను పెంచడం అనివార్యమన్నారు. సంస్థకు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.
ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. వీఆర్‌ఎస్‌పై ఉద్యోగులెవరినీ బలవంతం చేయడం లేదని, ఇష్టం ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. వీఆర్‌ఎస్‌ కోసం ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారన్న విషయంపై స్పష్టత వచ్చాక ఎంత మేర చెల్లించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వీఆర్‌ఎస్‌ ప్రక్రియ కొలిక్కి వచ్చిన అనంతరం ఖాళీలు ఎన్ని అన్న విషయంపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత ఖాళీల భర్తీ ప్రక్రియను చేపడతామన్నారు.

ప్రయాణికుల చెంతకు ఆర్టీసీని తీసుకు వెళ్ళాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని, ఇందుకోసం ఏ చర్యలు తీసుకోవాలి, ఆర్టీసీ నుంచి ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారన్న అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకంగా 104 మినీ బస్సులు నడుపుతున్నదన్నారు. ఉప్పల్‌ నుంచి యాదాద్రికి రూ.75లు, జూబ్లిబస్టాండ్‌ నుంచి రూ.100 చార్టీగా వసూలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో నుంచి యాదాద్రికి ఆర్టీసీ బస్సులు నడపనున్నామన్నారు. ప్రైవేట్‌ వాహనాలలో కంటే ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడమే సుఖప్రదమన్నారు. త్వరలోనే కర్నూలు, విజయవాడ నుంచి యాదాద్రికి నేరుగా బస్సులు నడపాలని కూడా నిర్ణయించామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement