Thursday, May 16, 2024

Peddapalli …..60 గ్యారెంటీ లు ఇచ్చినా కాంగ్రెస్ ను నమ్మరు .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు దొంగ హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కాదు 60 గ్యారంటీలు ఇస్తామన్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలియజేశారు. బుధవారం నియోజకవర్గంలోని పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా పబ్బం గడిపిన నాయకులు ఆరు గ్యారెంటీ పథకాలు అని డ్రామాలు ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో దమ్ముంటే రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బందు ఇలాంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడైనా 24 గంటల ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తున్నారా అని ప్రశ్నించారు. మొండి చేయికి ఓటేస్తే మూడు గంటల కరెంటు వస్తుందని, కారు గుర్తుకు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయన్నారు.

రైతాంగానికి వ్యవసాయం కోసం ముందస్తు పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, గత రెండు పర్యాయాలు ఆదరించిన విధంగానే మరోసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ జెండా ఎగిరేలా సహకరించాలన్నారు. సీఎం కేసిఆర్ తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్షాల మాయమాటలకు ప్రలోభాలకు లొంగ వద్దన్నారు.ఈ నెల బిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలవుతుందని, తర్వాత ప్రతి పక్షాల నేతల నోళ్ళు మూత పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement