Wednesday, May 8, 2024

45 రోజులలో కరివెన రిజర్వాయర్ కు సాగునీరు తెస్తాం – రజత్ కుమార్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 3 (ప్రభ న్యూస్): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్ కు 45 రోజుల్లో సాగునీటిని తీసుకొస్తామని ,రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు.
ఆదివారం అయన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింది నార్లాపూర్ వద్ద మొదటి పంపు లో నిర్వహించిన డ్రైరన్ కు హాజరయ్యారు. అనంతరం అక్కడే నీటిపారుదల శాఖ అధికారాలు,రెవెన్యూ,తదితర అధికారులతో సమీక్షించారు.పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై సమీక్షించిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని కరివేన రిజర్వాయర్ కు సంబంధించిన మిషన్ భగీరథ పైపు లైన్ మార్పిడి పనులను బిజినేపల్లి మండలం వట్టెం వద్ద పరిశీలించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సుప్రీంకోర్టు, ఎన్జీటీ అలాగే పర్యావరణ క్లియరెన్స్ లు అన్ని వచ్చిన తర్వాత ఆదివారం మొదటి పంపు వద్ద డ్రై రన్ నిర్వహించడం జరిగిందని, మూడు వారాలలో మొదటి మోటార్ ద్వారా వాటర్ ను పంపింగ్ చేస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ ను నింపిన తర్వాత ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపుతూ, 45 రోజుల్లో కరివెన రిజర్వాయర్ కు సాగునీటిని తీసుకువస్తామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేవని ,మిషన్ భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైపు మార్చే చిన్న సమస్యను, అదేవిధంగా కుడికిల్ల వద్ద ఉన్న డీప్ కట్ సమస్యను సైతం పరిష్కరించి సాగునీటిని తీసుకు వస్తామని తెలిపారు

.ఉత్తర తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు, ప్రజలకు ఆశీస్సులు కల్పించినట్లుగానే పాలమూరు-రంగారెడ్డి ద్వారా పాలమూరు జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లా కు ప్రభుత్వం సాగునీటి ఆశీస్సులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజక్టుల సీఈ బివి రమణారెడ్డి ,నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ,ఎస్ ఈ చక్రధరం, శ్రీనివాసులు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు,బిజినేపల్లి తహసీల్దార్ శ్రీరాములు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement