Thursday, April 25, 2024

అప్పుల్లో అధ్యాపకుల కుటుంబాలు! 4 నెలల నుంచి కాంట్రాక్టు లెక్చరర్లకు అందని జీతాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సగటు ఓ ఉద్యోగికి సమయానికి రావాల్సిన జీతం ఒక రోజు ఆలస్యమైతేనే ఎంత ఇబ్బంది పడతారో అందరికీ తెలిసిందే. మరీ విద్యార్థులకు చదువు చెప్పే కాంట్రాక్టు అధ్యాపకులకు ఏకంగా నాలుగు నెలల నుంచి వేతనం అందలేదంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీతాలు సమయానికి అందక జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే సుమారు 4500 మంది పైగా కాంట్రాక్టు లెక్చరర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై వేతనాలు లేక అప్పులతో కుటుంబాలను నడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు విన్నవించినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోతున్నారు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల్లో తగాదాలు అవుతన్నాయని చెప్తున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం కోసమో, పిల్లల చదువుల కోసం, గృహ అవసరాల నిమిత్తం బ్యాంకుల నుంచి పొందిన రుణాలకు నెలనెల ఈఎంఐలు కట్టేందుకు ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రతి నెల 5, 10 తేదీల్లోగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.

నెలనెలా వేతనాలు రాకపోవడంతో బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్లేక తెలిసిన వారి దగ్గరి నుంచి అప్పు తెచ్చి ఫెనాల్టితో కట్టాల్సి వస్తుందని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల ఇంటి కిరాయి కట్టేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని, తెచ్చిన అప్పులను కట్టలేక ఆర్థిక ఇబ్బందుల్లో కటుంబాలు గడుస్తాన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వీరి వేతనాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే బీఆర్‌వో విడుదల చేసింది. అయితే వీరిని రెన్యూవల్‌ చేయకపోవడంతోనే వేతనాలు ఇవ్వలేకపోతున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు నెలల నుంచి చెల్లించాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.రమణరెడ్డి, డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ తెలిపారు. వేతనాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement