Thursday, October 10, 2024

ఎన్నికల జాబితాలో తప్పుల్లేకుండా చూడాల్సిన బాధ్యత పార్టీల ప్రతినిధులదే.. కలెక్టర్

కామారెడ్డి, జూలై 19 (ప్రభ న్యూస్): ఎన్నికల జాబితాలో తప్పులు లేకుండా చూడవలసిన బాధ్యత రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2, 3 తేదీలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉన్న వారికీ తెలియజేయవచ్చని సూచించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారమందించాలని కోరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలలో అన్ని రకాల దరఖాస్తులు కలిపి 40 వేలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు.

ఫారం-8 ద్వారా ఓటర్ల చిరునామాలో మార్పులు, చేర్పులు ఉంటే చేసుకోవచ్చని సూచించారు. ఎలక్ట్రానిక్ యంత్రాలపై ఎలాంటి అపోహలు ఉండవద్దని సూచించారు. 10శాతం యంత్రాలను గ్రామ స్థాయిలో అవగాహన కోసం వినియోగిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లు లేకుండా చూడవలసిన బాధ్యత మీపై ఉందన్నారు. బూతు స్థాయి అధికారులు గరుడ యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. చనిపోయిన ఓటర్ల విషయంలో ఖచ్చితంగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొంది కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాత ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఎల్.ఓ. లకు సహకరించాలని కోరారు. 2023 ఆగస్టు 21న ఓటర్ల ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించబడుతుందని, అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని, ఆ జాబితా ప్రకారమే వచ్చే ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, నరేందర్, సురేష్, అనిల్ కుమార్, ఖాసీం అలీ, బాల్ రాజు, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement