Thursday, April 25, 2024

వంద పడకల దవాఖాన పేద ప్రజలకు వరం : మంత్రి వేముల‌

భీమ్‌గల్ టౌన్ : బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలో వందపడకల దవాఖాన ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలోని నిరుపేద ప్రజలకు వరమ‌ని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. గురువారం భీమ్ గల్ బస్టాండ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్​ఎస్​ శ్రేణులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. పట్టణంలో తాను కోరిన వెంటనే వంద పడకల దవాఖాన ఏర్పాటు మంజూరు చేయ‌డంతో పాటు రూ.35 కోట్లు ప్రతి ఏడాది నిర్వాహణకు రూ.10 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. దవాఖాన ఏర్పాటుకు సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో వారంలో దవాఖాన నిర్మాణానికి భూమిపూజ చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. దవాఖాన నిర్మాణం పూర్తయితే ఇన్నాల్లు నిరుపేద ప్రజానీకానికి ఖరీదైన వైద్యం ఇక్కడే అందుతుందన్నారు. రాష్ట్రంలో ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువస్తున్నారని కొనియాడారు. భీమ్ గల్ పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వందపడకల దవాఖాన తన హాయంలో మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. దవాఖాన మంజూరుతో కేసీఆర్ కు బాల్కొండ నియోజకవర్గం ప్రజలంటే అత్యంత ప్రేమని మరోమారు నిరూపితమైందన్నారు. ఉద్యమ సమయం నుంచి రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండడంతో ఈ ప్రాంత కష్ట నష్టాలు వారికి బాగ తెలుసన్నారు. అందుకే ఈ ప్రాంతానికి చెక్ డ్యాంలు, లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, మున్సిపాలిటీ ఏర్పాటుతో పాటు వంద పడకల దవాఖాన ఏర్పాటు ఇలా ఏది అడిగినా కాదనకుండా ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇంత చేస్తున్న కేసీఆర్ కు రుణపడి ఉంటానని పేర్కోన్నారు. నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ దవాఖాన మంజూరుకు సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా హస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తేస్తామని అన్నారు. మరో వారం పది రోజుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్స‌న్ కన్నె ప్రేమలత, కన్నె సురేందర్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, బొదిరే నర్సయ్య, మోయిస్, సతీశ్ గౌడ్​, మల్లెల ప్రసాద్, తుక్కాజీ నాయక్, పతాని లింబాద్రి, మూతలింబాద్రి, శివసారి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement