Sunday, May 5, 2024

TS: తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయొద్దు.. బీజేపీ, కాంగ్రెస్ లపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజల్లో అశాంతిని సృష్టించి, రాష్ట్రంలో వాతావరణాన్ని కలుషితం చేసే పనులను బీజేపీ, కాంగ్రెస్ లు మానుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ, కాంగ్రెస్ లపై మండిపడ్డారు. కేసీఆర్, తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లపాటు కొట్లాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, నేడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమాల్లో పరుగులు పెడుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కాదని ఎన్నికల గాంధీగా అవతారమెత్తి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు వారి మోసాలకు మోసపోవద్దని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 60ఏళ్లలో చేయలేని అభివృద్ధిని 10ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపించిందని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ఓర్చుకోలేక ఎన్నికల్లో నెరవేర్చలేని హామీలు గుప్పిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రైవేటుపరం చేయడం జరిగిందని, ఆనాడు నిజామాబాద్ బోధన్ శాసనసభ్యులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లపాటు ఫ్యాక్టరీని నడిపే ప్రయత్నం చేశామని కార్మికులకు జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించిందని, చెరుకు పండించిన రైతులు మహారాష్ట్రకు తరలిస్తే వారికి కూడా ప్రభుత్వం రవాణా ఖర్చులను అందజేశామన్నారు. ఆ రోజుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బోధన్ నుండి ప్రాతినిధ్యం వహించిన సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఏమి ఉద్ధరించారని, రాష్ట్ర ప్రజలు సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలువలను ఆధునీకరించడం కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు మూడున్నర ఏళ్లలో పూర్తి చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు ప్రారంభిస్తే వారు మూడు తరాలు చూసేవారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మోడీలు ఇతర పార్టీల నాయకులందరూ నిజాంబాద్ వైపే చెక్కర్లు కొడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి వెళ్లాలని తాము స్వాగతిస్తామని ఎమ్మెల్సీ చలోక్తులు విసిరారు. రాష్ట్రంలో మతకల్లోలాలను రెచ్చగొట్టే వారిని శాంతి భద్రతలను కాపాడలేక ముఖ్యమంత్రులను మార్చే సాంప్రదాయం కాంగ్రెస్ వారిదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో తో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మైండ్ బ్లాక్ అయిందని, నోటికొచ్చిన మాటలు తూటాలుగా విసురుతున్నారని, తెలంగాణ ప్రజలు అభివృద్ధి సంక్షేమాలను చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బీసీ గణనాన్ టు జనగణ అంటూ అవగాహన లేని మాటలు మాట్లాడి ప్రజలను అశాంతికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

తెలంగాణలో బీసీల పాలన కొనసాగుతోందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒకే ఒక్క బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఉండేదని 65 ఏళ్లలో వారు చేయలేని పని తాము పదేళ్లలో చేసి చూపామని నేడు 15 బీసీ వెల్ఫేర్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో శాసనసభ్యులు ఎవరికి వారు తమ నియోజకవర్గాలను పోటీపడి అభివృద్ధి పరచుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం రైతుబంధు లాంటి పథకాలను అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో తో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాలేని పరిస్థితిలో అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఎమ్మెల్సీ హెచ్చరించారు.

రైతుబంధు పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అమలు చేస్తుందా ? నేడు కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు పదివేలు ఇస్తూ రాబోయే రోజుల్లో 12 వేల నుండి 16 వేలకు పెంపుదల చేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేశారని గుర్తు చేశారు. రైతులకు రైతు బీమా వర్తింప చేస్తున్నామని కుటుంబ పెద్ద చనిపోతే వారి కుటుంబీకులకు ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని వివరించారు. భూములు లేని వారికి బీమా కల్పించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ బంధు అమలు చేయనున్నామని వివరించారు. తెలంగాణలో ఐదు లక్షల కుటుంబాలు ఉంటే 95 వేల కుటుంబాలకు కేసీఆర్ బంధు వర్తిస్తుందన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కొంతమందికి కొన్ని సంక్షేమాలు అందజేయలేక పోయామని వారికి కూడా అందించేందుకు తెలంగాణ ఆడబిడ్డలకు సౌభాగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేసి ఆడబిడ్డలకు 3000 రూపాయలు నెలకు అందజేసే ప్రకటన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎమ్మెల్యే సతీమణి ఐయేషా ఫాతిమా, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు బుద్ధి రాజేశ్వర్, రవీందర్ యాదవ్, నక్క లింగన్న, సత్యం, ఇలియాజ్, సోహిల్, సాలూర షకీల్, డేంజర్ గంగారం, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement