Sunday, April 28, 2024

NZB: ఇందిరమ్మ రాజ్యం వస్తే అంధకారం… విప్ గంప గోవర్ధన్

బిక్కనూర్, నవంబరు 21 (ప్రభ న్యూస్) : ఇందిరమ్మ రాజ్యం వస్తే తెలంగాణ అంధకారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి, రాజంపేట మండలంలోని పొందుర్తి, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ… కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు కూడా ఉండదన్నారు.

అన్నివర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మూడవసారి అధికారంలోకి రాగానే మరిన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. భారతదేశంలోని 26 రాష్ట్రాల్లో అమలు కాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు నరసింహులు యాదవ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ సిద్ధిరాములు, అధికార పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, బలవంతరావు, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, సిద్ధిరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యశోద కృష్ణయ్య, కుందుర్తి గ్రామ సర్పంచ్ గంగా కిషన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement