Friday, October 4, 2024

NZB: అర్హులైన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ వర్తించేలా చూడాలి..

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 6 (ప్రభ న్యూస్): రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరుగగా, వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై ముందుగా సమీక్షించారు. రైతులకు రుణమాఫీ చేయాలని సభ్యులు కోరగా, అర్హులైన వారందరికీ రూ.లక్ష రుణమాఫీ ద్వారా ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని సంబంధిత వ్యవసాయ అధికారులతో పాటు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ను జెడ్పి చైర్మన్ విఠల్రావు సూచించారు. కాగా, ఈసారి ఖరీఫ్ లో జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేయగా, 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పౌరసరఫరాల శాఖ అధికారులు సమావేశంలో సభ్యుల దృష్టికి తెచ్చారు. ఇందులో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 259 రేషన్ షాపుల ద్వారా సుమారు 4,51,200 పైచిలుకు కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోందని వివరించారు. ఆసరా పెన్షన్ల వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గించిన మేరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేసేలా ప్రభుత్వానికి నివేదించాలని సమావేశంలో సభ్యులు కోరారు. పశుసంవర్ధక శాఖ ద్వారా చేపడుతున్న గోపాలమిత్ర నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన చోట తక్షణమే నైట్ వాచ్ మెన్లు, అటెండర్లను నియమించి బడులలో సామాగ్రికి భద్రత కల్పించాలని డీ.ఈ.ఓకు సూచించారు. వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ జరపాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ కు జెడ్పి చైర్మన్ విఠల్రావు ఆదేశించారు. ఏ.ఎన్.ఎంలు, ఆశా కార్యకర్తలచే ఇంటింటి సర్వే జరిపించి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి అవసరమైన మందులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ గోవింద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement