Sunday, March 26, 2023

స్వార్థం కోస‌మే రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్ర‌జా దీవెన స‌భ కోసం మునుగోడులో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌లిసి స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్వార్థం కోస‌మే రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశార‌ని తెలిపారు. ఆత్మ‌గౌర‌వాన్ని బీజేపీ వ‌ద్ద తాక‌ట్టుపెట్టిన నీచుడు రాజ‌గోపాల్ రెడ్డి అని ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ వైఖ‌రి దొంగే దొంగా అన్న‌ట్లుగా ఉంద‌న్నారు.

- Advertisement -
   

ఎనిమిదేళ్లుగా ప్రజ‌ల‌కిచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మునుగోడు అభివృద్ధి చెందిందని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నో కుట్రలు చేసింది,ఇంకా చేస్తూనే ఉందని తెలిపారు. దేశ ద్రోహానికి పాల్పడుతున్న బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామ‌ని చెప్పారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ విజయం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రెండో స్థానానికి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. దేశ పరిస్థితుల దృష్ట్యా వామపక్షాలు టీఆర్ఎస్‌కే మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement