Monday, April 29, 2024

నిబద్ధతతో పని చేయాలి : సీపీ స్టీఫెన్ రవీంద్ర

నిబద్ధతతో పని చేయాలని ప్రొబేషనరీ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. 2020 బ్యాచ్ కు చెందిన 23 మంది నూతన ప్రొబేషనరీ రిజర్వ్ సబ్ఇన్ స్పెక్టర్లు సోమవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రను మ‌ర్యాద పూర్వకంగా కలిశారు. గ్రే హౌండ్స్, ఐఎస్ డబ్ల్యూ, సీఎస్ డ‌బ్ల్యూ, ట్రాఫిక్, పీటీఓ వంటి వివిధ విభాగాల్లో ఫీల్డ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో రిపోర్ట్ చేశారు. 23 మంది రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లలో పురుషులు 20, మహిళలు ముగ్గురు ఉన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండాలని కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఆర్ఎస్ఐలకు సూచించారు. నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలన్నారు.

పోలీసులు శారీరక ధృడత్వంతో పాటు మానసికంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ క్రమశిక్షణ కలిగిన డిపార్ట్ మెంట్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో అలసత్వం వహించరాదన్నారు. ప్రజల మేలు కోసం నిబద్ధతతో పని చేసి తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆధునిక పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు. పెరుగుతున్న ఆన్ లైన్ మోసాల దృష్ట్యా ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన, లోన్ యాక్ట్స్ వంటి విషయాలపై జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. సిబ్బంది మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, ఏసీపీ మ‌ట్ట‌య్య, అడ్మిన్ ఆర్ఐ హిమకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement