Tuesday, April 30, 2024

ఎమ్మెల్యే రఘునందన్ కు ఎంపీ కేపీఆర్ సవాల్…

కేసీఆర్ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలుకుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. తెలంగాణ రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే..ప్రధాని మోడీ మెడలు వంచి..యాసంగిలో వడ్లు కొనేలా చేయాలని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావుకు సవాల్ విసిరారు. దుబ్బాకలో రెడ్డి సంఘం పంక్షన్ హాల్లో విలేఖరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యం వేయవద్దని, యాసంగి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో తెలంగాణ వ్యాప్తంగా యాసంగి సాగుపై రైతుల్లో భయాందోళన నెలకొందన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కావున యాసంగిలో వరి సాగు చేసేలా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రకటన తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

2016లోనే జాతీయ రహదారులపై అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు ప్రపోజల్ పంపించి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దుబ్బాక బస్ డిపో కు తాను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సహకారంతో నిధులు మంజూరు చేయిస్తే.. తాను చేయించానని ఎమ్మెల్యే చెప్పుకోవడం అవివేకమే అవుతుందన్నారు. జాతీయ రహదారుల మీద అండర్ బ్రిడ్జిల నిర్మాణం గురించి ఎమ్మెల్యేకు అనుమానం ఉంటే..కేంద్ర మంత్రి దగ్గర సమాచారం తీసుకోవాలన్నారు. మల్లన్న సాగర్ రైతులకు సిద్దిపేట, గజ్వెల్ తరహాలో పరిహారం ఇప్పిస్తానని మల్లన్నసాగర్ కట్ట మీదికి వెళ్లిన ఎమ్మెల్యే తర్వాత మరిచిపోయాడన్నారు. ఎమ్మెల్యే మరిచిపోవడంపై రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయని, రైతులకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. అబద్దాలతో కాలం వెళ్లదీయవద్దని, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత భూమి రెడ్డి, నాయకులు రొట్టె రాజమౌళి, ఆసా స్వామి, గుండెల్లి ఎల్లారెడ్డి, పల్లె రామస్వామి గౌడ్, షేర్ల కైలాసం, అబ్భుల రాజలింగం గౌడ్, సంజీవ రెడ్డి, బాలకృష్ణ గౌడ్, వంశీ, కనకయ్య, పర్శరాములు, జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement