Sunday, April 28, 2024

నిర్మల్ లో ఆక్సిజ‌న్ ప్లాంట్.. ప్రారంభించిన మంత్రి అల్లోల

నిర్మల్ జిల్లా ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ కొర‌త‌ను తీర్చేలా స్థానికంగా ఉత్ప‌త్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ ప్లాంట్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండ‌వ ద‌శ‌లో కోవిడ్ కేసులు అధికంగా న‌మోదు అవ‌డం, శ్వాసకోస స‌మ‌స్య‌తో తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరి ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది మృత్యువాత ప‌డ్డార‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్ లో ఇలాంటి పరిస్థితులు ఉత్ప‌న్నం కాకుండా ఉండేందు నిర్మ‌ల్ ఆసుప‌త్రిలో కోటి రూపాయాల వ్య‌యంతో ఆక్సిజ‌న్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామ‌న్నారు. గాలిని తీసుకుని ప్ర‌త్యేక సాంకేతిక‌ ప‌రిక‌రాల‌తో శుద్ధి చేసిన సిలిండ‌ర్ల ద్వారా నేరుగా రోగికి అంద‌జేస్తారన్నారు. జిల్లా ఆసుప‌త్రికి వ‌చ్చే పేషంట్ల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి అవుతుంద‌ని,ఈ ప్లాంట్ ద్వారా నిమిషానికి సుమారు 500 లీటర్ల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి  అవుతుంద‌ని చెప్పారు.  

జిల్లా ఆసుప‌త్రిగా ఆప్ గ్రేడ్ అయిన నిర్మ‌ల్ ఏరియా ఆసుప‌త్రి అభివృద్ధి, ఆధునాత‌న‌ వైద్య ప‌రిక‌రాలను స‌మ‌కూర్చుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 48.83 కోట్లు మంజూరు చేసినందుకు ఆయ‌న‌కు మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. కాగా, ఈ కార్య‌క్ర‌మంలో ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్  కే.విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ ఫారూఖీ అలీ, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement