Saturday, April 27, 2024

లబ్ధిదారులకు బాసటగా ఎమ్మెల్యే ‘వేగుళ్ళ’…

జగనన్న భూహక్కు ఒత్తిళ్ళు వద్దు…
స్వచ్ఛందమైతే అభ్యంతరం లేదు..

మండపేట : జగనన్న భూ హక్కు పధకం పేరిట గతంలో గృహ రుణాలు తీసుకున్న పేదలను రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల ఈ పధకం ద్వారా  గతంలో హౌసింగ్ రుణాలు తీసుకున్న వారికి ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ లా రూ.15 వేల నుండి రూ 30 వేలు చెల్లించేలా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వేగుళ్ళ ఆరోపించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ను  వివరణ కోరారు. ఎమ్మెల్యే వేగుళ్ళ, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ లు  కమిషనర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గృహ రుణాలు తీసుకున్న వారి గృహాలకు రుణం  సొమ్ములు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సచివాలయం ఉద్యోగులు, అధికారులు ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసంగా ఉందని ప్రశ్నించారు. హక్కు లభించే జి ఓ 2011 లోనే జారీ అయ్యిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.  

ఈ రిజిస్ట్రేషన్ల విధానం 2011లోనే అమలులోకి వచ్చిందన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని సమీక్షలు జరిపి గత ప్రభుత్వాలు దీన్ని ఆచరణలో పెట్టలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన జీవోను బయటకు తీసి జగనన్న భూ హక్కు అంటుందని ఎద్దేవా చేశారు. 2011 జీవోలో కొన్ని అంశాలు స్పష్టం గా ఉన్నాయన్నారు. అందులో రూ. 15 వేలు ,రూ 30వేలు చెల్లించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్న నిబంధన ఎక్కడ లేదన్నారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారి  ఇష్టపూర్వకంగానే జరపాలే తప్ప ఎక్కడ బలవంతం చేయకూడదని స్పష్టంగా ఉందన్నారు. రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల ఒత్తిడి పై ఇటీవల గొల్లపుంత కాలనికి చెందిన ఓ మహిళ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేసిందన్నారు. ఆమెను  బెదిరించారని ఆరోపించారు.

1983 నుండి దివంగత ఎన్.టి.ఆర్. అప్పటి ప్రధాని దివంగత ఇందిరా గాంధీ, వారి తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ ఇచ్చిన ఇళ్ళ పట్టాల మీద సొమ్ము వసూలు చెయ్యటం చాలా దారుణమని పేర్కొన్నారు. కమీషనరే తప్పనిసరి కాదని చెప్పారన్నారు. ఈ విషయాన్ని లబ్దిదారులు గమనించాలన్నారు.  చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కాగానే ఎటువంటి ఛార్జీలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించే భాద్యతని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ తెలియజేశారు. రిజిస్ట్రేషన్ల విషయంలో పేదలకు తాము బాసట గా నిలుస్తామని తెలిపారు.ప్రజలు ఇష్టపూర్వకంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే మంచిదేనన్నారు. అలాకాకుండా సచివాలయ ఉద్యోగులు, అధికారులు ఒత్తిడులకు గురి చేస్తే  తన దృష్టికి తేవాలని కోరారు.

స్వచ్ఛందంగా వస్తేనే…..

- Advertisement -

మండపేట టౌన్ పరిధిలో జగనన్న భూ హక్కు లో గృహ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు స్వచ్ఛందంగా వచ్చి ఆన్లైన్ లో తమ పేర్లు నమోదు చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ లు చేపడతామని మండపేట మునిసిపల్ కమిషనర్ రామ్ కుమార్ స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకే తాము వ్యవహరిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement