Friday, May 17, 2024

నెల రోజుల శిశువుకి అరుదైన స‌ర్జ‌రీ- వైద్యులకు అభినంద‌న‌లు తెలిపిన మంత్రి హ‌రీశ్ రావు

నిమ్స్ హాస్పిట‌ల్ లో గ‌త నాలుగు రోజుల‌కుగా చిన్నారుల‌కు అరుదైన గుండె స‌ర్జ‌రీలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 8 స‌ర్జ‌రీలు పూర్త‌య్యాయి. ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు బ్రిట‌న్ నుంచి డాక్ట‌ర్ వెంకట ర‌మ‌ణ దన్నపునేని నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందం నిమ్స్ వైద్యుల, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్స్ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంలో ఈ స‌ర్జ‌రీలు నిర్వ‌హించారు. చిన్నారులకు గుండె సర్జరీలు చేయడం అనేది, ఎంతో క్లిష్టమైనది, ఖరీదైనది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో దాదాపు 5 లక్షల దాకా అయ్యే ఈ చికిత్సను పేద చిన్నారులకు ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. తాజాగా నెల రోజుల వ‌య‌సున్న శిశువుకు స‌ర్జ‌రీనీ విజయవంతంగా చేశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మిడ్జిల్ కు చెందిన నెల రోజుల వ‌య‌సున్న శిశువు (త‌ల్లి ఫాతిమా) ఇటీవ‌ల తీవ్ర హృద్రోగ స‌మ‌స్య‌ల‌తో నిమ్స్ ఆసుప‌త్రిలో చేరింది. అప్ప‌టికి శిశువు బ‌రువు కేవ‌లం 2.5 కిలోలు. ఆర్టీరియ‌ల్ అనాట‌మీ, మ‌ల్టిపుల్ వెంట్రిక్యులార్ సెప్ట‌ల్ డిఫెక్ట్స్ తో హాస్పిట‌ల్ లో చేరింది. బ్రిట‌న్ నిపుణులు, నిమ్స్ వైద్యులు, నీలోఫ‌ర్ డాక్ట‌ర్లు క‌లిసి ఒక బృందంగా ఏర్ప‌డ్డారు. గ‌త నెల 28వ తేదీన శిశువుకు ఆర్టీరియ‌ల్ స్విచ్ రిపేయిర్‌, మ‌ల్టిపుల్ వీఎస్‌డీ క్లోజ‌ర్ స‌ర్జ‌రీలు విజయవంతంగా నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో ఇలాంటి స‌ర్జ‌రీ జ‌ర‌గ‌డం రాష్ట్రంలోనే మొద‌టిసారి కాగా, శిశువు ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంది. క్ర‌మంగా కోలుకుంటుంది.

మంత్రి హ‌రీశ్ రావు అభినంద‌న‌లు

అరుదైన స‌ర్జ‌రీ చేసి శిశువు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యుల‌ను ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు అభినందించారు. బ్రిట‌న్ నుంచి ప్ర‌త్యేక వైద్య బృందం వ‌చ్చి నిమ్స్ లో చిన్నారులకు చేసే స‌ర్జ‌రీల్లో పాల్గొన‌డం, సహకారం అందించడం గొప్ప విషయం. శిశువు త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకొని త‌ల్లి ఒడికి చేరాల‌ని కోరుకుంటున్నానన్నారు మంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement