Monday, May 6, 2024

మూడేళ్లైనా.. డబుల్ ఇళ్లు ఇయ్య‌ట్లే..!

నిజాంపేట : మండలకేంద్రంలో కట్టే 104 డబుల్ బెడ్ రూమ్ లను కట్టివ్వకుండా.. మండలంలోని కల్వకుంట, చల్మేడ, నందిగామ గ్రామాల్లో పూర్తయినా 154 డబుల్ బెడ్ రూమ్ లను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టి ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ డబుల్ ఇండ్లు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అందడం లేదు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో నిర్మించిన 74 ఇండ్లకు గ్రామంలోని 475 మంది అర్జీలు పెట్టుకున్నారు. నిర్మించిన ఆ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసం కాగా కొన్ని రూమ్ లలో ప్లోరింగ్ కుంగిపోయింది. చల్మేడలో 40 ఇళ్లకు గాను 178 మంది అర్జీలు పెట్టుకున్నారు. వీటిలో కూడా కొన్ని కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. నందిగామలో కట్టిన 40 ఇళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవి కూడా లబ్ధిదారులకు అందడం లేదు. వాటిలో మందు బాబులకు, సిగరెట్ తాగే వారికి అడ్డాగా మారాయి. కొన్ని డబుల్ ఇండ్లలోని మెట్లన్నీ కాల్చి పారేసిన సిగరెట్ లతో నిండిపోయాయి. లబ్ధిదారుల ఎంపికకు 20జూన్ 2020లో చల్మేడ,కల్వకుంట గ్రామాలలో మెదక్ ఆర్డీఓ సాయిరాం గ్రామ సభలను నిర్వహించి.. లబ్ధిదారులను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు మరియు గ్రామ సర్పంచ్ లకు సూచించారు. గ్రామ సభ పెట్టి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా ఇండ్లు కేటాయింపులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సార్లు గెలిపించిన పద్మాదేవేందర్ రెడ్డి ఏం చేస్తుందని కొంతమంది నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. కట్టినయ్ పాడవుతున్నాయి వాటిని గూడు లేని పేద వారికి అందిస్తే మంచిగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం విఫలం : మహేందర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి, నిజాంపేట
నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తయి మూడు సంవత్సరాలు కావస్తున్న అర్హులకు ఇండ్ల పంపిణీ చేయ‌డం లేదు. డబుల్ బెడ్ రూమ్ లలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయి. ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి త్వరితగతిన ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. పేద‌ల‌ సొంతింటి కలను నెరవేర్చాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement