Sunday, April 28, 2024

MDK : పెద్ద‌కొడుకు కేసీఆర్‌… చిన్న కొడుకు రేవంత్‌రెడ్డిః ర‌ఘునంద‌న్‌రావు సెటైర్​

మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. సోమవారం ఆయ‌న మెద‌క్ జిల్లా తూప్రాన్‌లో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదరికం, నిరుద్యోగం తగ్గించేందుకు, రైతులు, మహిళల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

- Advertisement -

కేసీఆర్ పెద్ద కొడుకు అని నమ్మి పదేళ్ళు అధికారం ఇస్తే ఏంచేసిండని ప్ర‌శ్నించారు. తూప్రాన్ లో తిరుగుతుంటే వినతి పత్రాలు ఇస్తున్నారని, కనీసం ఆడపిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయలేదని మండిప‌డ్డారు. సిద్దిపేటకు అన్ని మంజూరు చేసుకున్న హరీష్ రావు పదేళ్ళు అధికారంలో ఉండి కూడా తూప్రాన్ కు ఒక్క డిగ్రీ కళాశాల మంజూరు చేయించలేదని దుయ్యాబ‌ట్టారు. ఇగ చిన్న కొడుకు రేవంత్ రెడ్డి వచ్చిండు. రూ. 4 వేల పెన్షన్ ఇస్తున్నడు ఏమైంది అంటూ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 తారీఖున రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తాన‌ని చెప్పాడ‌ని ఏమైంది నీ రుణమాఫీ రేవంత్ రెడ్డి అంటూ చ‌వాక్కులు పేల్చారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 నెలలవుతుందని, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 లు ఇస్తన్నడు, ఇచ్చిండా అంటూ ప్ర‌శ్నించారు. కాంగ్రెసోళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అని పెట్టిర్రు అని వట్టిగా తిరిగి ఏంజేస్తరు? ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టుడు తప్ప ఇంకేమీ లేదంటూ ఉద్ఘాటించారు.

రాజ్ పుష్ప కంపెనీ పేరుతో రూ.100 కోట్ల కు ఏకరా చొప్పున వెయ్యి కోట్లు పెట్టి పదెకరాలు కొనుగోలు చేసిన వెంకట్రామిరెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడివని, తాను ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, డబ్బులు ఎలా పంచుతానని వెంకట్రామిరెడ్డి అంటుండు, కానీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిండు అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచినమని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్ర‌శ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడనా? లేక చర్యలు తీసుకోకుండా, కొత్త ప్రభాకర్ రెడ్డి రాయభారం నడిపీస్తుండా? అంటూ విమ‌ర్శించారు. రూ.14 కోట్లకు భూమి అమ్మిన అని చెప్పి కాగితం రాయించుకుని, రూ.14 కోట్లు బలవంతంగా గుంజుకుంది కవిత అని సీబీఐ దగ్గర కవిత ఒప్పుకుంది అని పేపర్లలో వచ్చిందని, ఇక్కడ శరత్ చంద్రారెడ్డి పిలుస్తలేరు, వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తలేరు,కవితపై కేసు ఎందుకు కేసు నమోదు చేయట్లేదని రేవంత్‌రెడ్డిని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలవనీయకుండా కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. తాను మళ్ళీ చెబుతున్న వెంకట్రామిరెడ్డి ఇవ్వన్నీ నేను చెప్పట్లేదు, అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిండని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement