Sunday, April 28, 2024

రాష్ట్రస్థాయిలో స్వర్ణాలు సాధించిన మానుకోట రెజ్లర్లు.. అభినందించిన కలెక్టర్​

మహబూబాబాద్, (ప్రభ న్యూస్​) : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన మానుకోట విద్యార్థులను కలెక్టర్ కె.శశాంక అభినందించారు. కురవిలోని వీరభద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొర్ర అఖిల్, అడావత్ ఉదయ్ కుమార్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలో 55 కిలోల విభాగంలో ఉదయ్, 60 కిలోల విభాగంలో అఖిల్ అద్వితీయ ప్రతిభ కనపరిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరిగే జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు.

క్రీడాకారులు ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జె.ఎస్.డబ్ల్యూ సంయుక్త ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలోని హిసార్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక రెజ్లింగ్ శిక్షణ కేంద్రానికి ఎంపిక అయ్యారని, మెరుగైన పౌష్టికాహారం, ఇతరాత్ర అంశాలకు సంబంధించి ఆటగాళ్లకు అవసరముందని తెలుసుకున్న కలెక్టర్ వీరికి కార్పొరేట్ సంస్థ ద్వారా ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించడమే లక్ష్యంగా శ్రమించాలన్నారు. ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ రెజ్లింగ్ కోచ్ గుగులోతు అశోక్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి సూర్య నారాయణ, జిల్లా క్రీడలు, యువజన అధికారి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మహ్మద్ కరీం, వీరభద్ర జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బొడ వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement