Tuesday, April 30, 2024

Mandamarri – మొండి చెయ్యి, చెవిలో పువ్వు పార్టీల‌ను న‌మ్మితే నిండా మునుగుడే ..కెటిఆర్

మందమర్రి: మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవాచేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మందమర్రి చౌరస్తాలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓవైపు తెలంగాణకు మొండి చెయ్యి చూపే బీజేపీ, మరోవైపు చెవిలో పువ్వులు పెట్టే కాంగ్రెస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. వారంటీ లేని పార్టీ గ్యారంటీలను ననమ్ముదామా? అని ప్రశ్నించారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే 3 గంటల కరెంటు గ్యారంటీ అన్నారు. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి రావడం గ్యారంటీ అని, ఆకాశం నుంచి పాతాళం వరకు కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని విమర్శించారు.

కాంగ్రెస్‌ అంటే కన్నీళ్లు.. కష్టాలు అని, బీఆర్‌ఎస్‌ అంటే సాగునీళ్లు.. సంక్షేమం అని చెప్పారు. రైతు బంధు కేసీఆర్‌ కావాలా? రాబంధు కాంగ్రెస్‌ కావాలా? అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ కావాలా? 3గంగల కరెంటు ఇచ్చే కాంగ్రెస్‌ కావాలో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. మోదీ ఎన్ని చెప్పినా తొండి అని, ప్రధాని మనసులో తెలంగాణపై ప్రేమ లేదన్నారు. రాష్ట్రానికి రావడమే తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు.

దసరా దీపావళి పండుగవేళలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ భారీగా బోనస్‌ ప్రకటించారని చెప్పారు. సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్నారని, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. రూ.500 కోట్లతో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసుకున్నామని చెప్పారు. రాబోయే కాలంలో మందమర్రిని మున్సిపాలిటీగా చేసుకుందామని తెలిపారు. మంత్రులుగా ఉన్నవాళ్లు చేయని పనులను చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో బాల్క సుమన్‌ మంత్రి అయితే ఇంకా అద్భుతాలు చేస్తారన్నారు. ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎన్నికల్లో బాహుబలిని ఎదుర్కొని విజయం సాధించారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement