Wednesday, May 8, 2024

స్త్రీలను గౌరవించడం అలవాటు చేసుకోవాలన్న పోలీస్​ కమిషనర్​, బెల్లంపల్లిలో 10వేల మంది మహిళలతో సదస్సు

బెల్లంపల్లి, (ప్రభన్యూస్‌): మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ భారతి హోలికేరీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైదానంలో నిర్వహించిన మహిళా సాధికారత సభలో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగ వివక్షత చూపుతున్నారని, ఇది సరైంది కాదన్నారు. జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారని, ప్రతి రంగంలో మహిళలు దూసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కొడుకులు, కూతుర్లను ఒకే విధంగా చూడాలన్నారు. ప్రతి రంగంలో మహిళలు పురుషులతో సమానంగా ఎదగాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత మైన లక్ష్యాలను పెట్టుకుని చదువుకొ వాలన్నారు.

ఇంట్లో స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం విద్యావంతులవుతారన్నారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ముందుంటుందని, మహిళల భద్రతకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండి తక్షణమే స్పందిస్తారన్నారు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబంతోపాటు సమాజం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులతోపాటు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ మహిళలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటుందన్నారు. మహిళల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం 33శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిందన్నారు. పోలీసులు మహిళ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంత భారీగా కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. సభ నిర్వహించిన ఏసీపీ ఎడ్ల మహేష్‌, సీఐ జగదీశ్‌లను అభినందించారు. అనంతరం పారిశుధ్య, మహిళ కూరగాయల వ్యాపారులు, మహిళ పారిశుధ్య కార్మికులను, ఏఎన్‌ఎంలను, మహిళ రైతులను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement