Thursday, April 25, 2024

లాటరీ లక్కు ఎవరికో తేలేది నేడే..

నల్గొండ, (ప్రభన్యూస్‌) : మద్యం షాపులు దక్కించుకునేందుకు పోటీ-పడ్డారు.. దరఖాస్తుదారులు క్యూ కట్టి మరి వేశారు.. లాటరీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. పోటీ-పడి దరఖాస్తులు దాఖలు చేసిన వారిలో అదృష్ట జాతకులేవరో తేలిపోనుంది. డ్రాకు ఎక్సయిస్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు- చేశారు. అయితే దరఖాస్తుదారులు తమకు షాపులు దక్కుతాయేమోననే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 336 మద్యం దుకాణాలున్నాయి. ఈనెల 9వతేదీ నుండి 18వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8481 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు దరఖాస్తుల రూపంలో 169.62కోట్లు-(2లక్షలు తిరిగిరాని సొమ్ము) ఆదాయం సమకూరింది. నల్గొండ జిల్లాలోని 155 షాపులకు 4079 దరఖాస్తులు రాగా 81.58కోట్ల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లాలో 99షాపులకు 3023 దరఖాస్తులు వచ్చాయి. 60.46కోట్ల ఆదాయం సమకూరింది. అంతే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలోని 82 షాపులకు 1379 దరఖాస్తులు రాగా 27.58కోట్లు- రాబడి వచ్చింది.

అయితే దరఖాస్తుదారులు షాపులు దక్కించుకునేందుకు టెండర్‌ లు వేశారు. అయితే ఈసారి గౌడ్‌, ఎస్సీ, ఎస్టీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించారు. అయినా రిజర్వేషన్‌ స్థానాలకు సైతం పోటీ పడ్డారు. రిజర్వేషన్‌ స్థానాల్లో బినామీలతో టెండర్‌ లు వేసినట్లు చెపుతున్నారు. అయితే టెండర్‌ దారుల సమక్షంలో అధికారులు డ్రా తీయనున్నారు. నల్గొండ జిల్లా షాపుల లాటరీ గందంవారిగూడెం రోడ్డులోని గుండగొని మైసయ్య ఫంక్షన్‌ హల్‌ లో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారులు ఉదయం 9గంటలలోపు ఫంక్షన్‌ హల్‌ కు చేరుకోవాలని సూచించారు. అయితే ఒక్కొక్క షాపుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసిన వారు తమకే షాపులు దక్కుతాయనే ఆశతో ఉన్నారు. అసలు అదృష్టవంతులేవరో తేలిపోనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement