Sunday, May 19, 2024

TS | తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు : వాతావరణ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి రాష్ట్రం వైపుకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని కాని అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

కాగా… రాష్ట్రంలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నైరుతి రుతుపవనాల తిరుగమనం చివరి దశకు చేరడంతో వర్షాలు ముఖం చాటేశాయి.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. జులై చివరివారంలో వానలు దంచికొట్టాయి. ఆగస్టులో పెద్దగా కురవకపోయినా సెప్టెంబర్‌లో అడపాదడపా వర్షాపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలోని 18 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో లోటు- వర్షపాతం నమోదైనట్లు- వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement