Monday, April 29, 2024

సీఎస్‌పై వేసిన రిట్‌ పిటిషన్‌ విచారణ జాప్యంపై సీజేఐకి లేఖ: రఘునందన్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌పై వేసిన రిట్‌ పిటిషన్‌ ఐదేళ్ళు గడుస్తున్నా హైకోర్టు బెంచ్‌ ముందుకు ఎందుకు రావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రఘునందన్‌రావు రిట్‌ పిటిషన్‌ విచారణకు రాకుండా తొక్కి పెడుతున్నదెవరు, ప్రధాన న్యాయమూర్తి ముందుకు రాకుండా ఎందుకు ఆగిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు లేఖ రాసినట్లు తెలిపారు. గతంలో ప్రధాన మంత్రికి కూడా లేఖ రాశానని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం సోమేష్‌కుమార్‌ ఏపీకి కేటాయించిన అధికారి అనిపేర్కొన్నారు. సోమేష్‌కుమార్‌తో పాటు మరో 12 మంది అధికారులు కూడా ఆంధ్రాకు కేటాయించిన అధికారులేనని వారంతా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నారన్నారు. సోమేష్‌కుమార్‌ వల్ల అనేక మంది సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై అసెంబ్లి సెక్రెటరీకి నోటీసులు ఇవ్వాలని ఇద్దరు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని రఘునందన్‌రావు తెలిపారు. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని, న్యాయపోరాటం ఆపబోమన్నారు. సభ్యులుగా మా హక్కులను గౌరవించాలని కోరుతున్నామని, గతంలో రోజాను శాసనసభకు రాకూడదు అని స్పీకర్‌ చెబితే హైకోర్టు రోజా సభలోకి కాకుండా ఆ ప్రాంగణంలో ఎక్కడైనా వెళ్లొచ్చు అని చెప్పిందని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను స్పీకర్‌ గౌరవించాలని కోరుతున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement