Thursday, May 2, 2024

TS | రాజకీయ యుద్ధభేరి మోగిద్దాం.. వాటా కోసం పోరాడుదాం: ప‌ద్మశాలి సంఘం

తెలంగాణలో పద్మశాలీలకు జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేందుకు పోరాడక తప్పదని సంఘం రాష్ట్ర సమన్వయకర్త రామ శ్రీనివాస్​ అన్నారు. ఇవ్వాల హైదరాబాద్​లోని పద్మశాలి సంఘం రాష్ట్ర ఆఫీసులో ఆగస్టు13 జరిగే ‘చలో కోరుట్ల–రాజకీయ యుద్ధభేరి’ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మా హక్కులు, మా వాట సాధించుకోవడానికే కోరుట్లలో లక్ష మంది పద్మశాలియులతో రాజకీయ యుద్ధభేరి నిర్వహించనున్నట్టు తెలిపారు. దామాషా ప్రకారం పద్మశాలిలకు అసెంబ్లీలో పది స్థానాలు, కౌన్సిల్ లో  ఐదు స్థానాలు, పార్లమెంట్లో మూడు స్థానాలు కల్పించాలని రాజకీయ పార్టీలకు కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ ఉద్యమంలోనూ, మలిదశ ఉద్యమంలోనూ పద్మశాలీలు ఎనలేని త్యాగాలు చేశారని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమన్వయకర్త రామ శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్మశాలి నాయకులు ఉద్యమించి ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ సకలజనుల సమ్మెలో పద్మశాలీలంత మగ్గాలు, రాట్నాలను రోడ్లపై ప్రదర్శించి ఉద్యమించారని చెప్పారు.

వేలాది మంది పద్మశాలియులతో గర్జనలు నిర్వహించామని, అయితే.. రాష్ట్రంలో రాజకీయంగా నష్టపోయింది మాత్రం పద్మశాలి కులమని అన్నారు. కోరుట్లలో జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధభేరికి పల్లె పల్లె నుండి ఎవరికి వారే సైనికుల వలె తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్త రమేష్, గంజి శ్రీనివాస్, బైరి శ్రీనివాసరాజు, వల్లకాటి రాజకుమార్, బింగి నవీన్, గందెమల్ల రాజు, సీత వైద్య కిషోర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement