Tuesday, May 21, 2024

ప్రభుత్వ బడులను వేధిస్తున్న హెచ్‌ఎంల కొరత.. నెట్టుకొస్తున్న విద్యాశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం) కొరత తీవ్రంగా వెంటాడుతోంది. దాదాపు విద్యాశాఖలో పదిహేడేళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాల్లేని పరిస్థితి. ఏడేళ్లుగా స్కూల్‌ అసిస్టెంట్‌, ప్రధానోపాధ్యాయులకు ప్రమోషన్స్‌, నాలుగేళ్లుగా బదిలీలు లేవు. దీంతో ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో పోస్టులను అదనపు బాధ్యతలతో ఇతరులకు కట్టబెట్టి విద్యాశాఖ నెట్టుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1970 హైస్కూళ్లల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2100 ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. అంతేకాకుండా 7250 సబ్జెక్ట్‌ టీచర్ల(స్కూల్‌ అసిస్టెంట్‌) కొరత ఉంది. పైగా 10478 పండిట్‌, పీఈటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వెజెస్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులను ప్రమోషన్‌ కల్పించడం ద్వారానే భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ముఖ్యంగా హైస్కూల్‌, ప్రైమరీ పాఠశాలల్లో హెచ్‌ఎంల కొరత ఉండడంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే సుమారు 10 వేల నుంచి 20 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయి. 50 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరిగే అవకాశముంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందనే అభిప్రాయాలను ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టారు. అయితే సరిపడా టీచర్లు లేకపోవడంతో ఉన్న టీచర్లకే బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక్కో టీచరు సామర్థ్యానికి మించి అదనపు క్లాసులు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇన్‌చార్జీ ఎంఈవోలుగా ఉన్న ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలను కట్టబెడుతున్నారని ప్రాధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 20లక్షల మందికిపైగా విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్‌ మీడియం విద్యతోపాటు దశలవారీగా డిజిటల్‌ విద్య, మౌలిక వసతుల కల్పనను అందించాలంటే పర్యవేక్షణ చేసే హెచ్‌ఎంలు, ఎంఈవోలు కొరతను తీర్చాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ బడుల్లో చేరికలు…

- Advertisement -

కరోనా కారణంగా గతేడాది ఏకంగా 2.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరితే.. ఈ సారి 13379 మంది మాత్రమే చేరారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మొత్తం 2,07,474 మంది ఉన్నారు. ఈక్రమంలో అవసరమైన ఉపాధ్యాయులను ఇస్తే సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం వచ్చేది. కానీ విద్యాశాఖ మాత్రం టీచర్ల పోస్టులను భర్తీ చేయకపోగా గత 2020 మార్చి వరకు పనిచేసిన 12 వేల విద్యా వాలంటీర్లను విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులకు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేదిస్తోంది.

టీచర్ల నిష్పత్తి ఇలా…

జీవో నెంబర్‌ 25 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఈ విధంగా ఉంది. 121 నుంచి 150 మంది విద్యార్థులకు 5 మంది ఉపాధ్యాయులు ఉండాలి. 151 నుంచి 200 మంది విద్యార్థులకు ఆరుగురు టీచర్లు, 201 నుంచి 240 మంది విద్యార్థులకు ఏడుగురు, 241 నుంచి 290 మందికి 8 మంది ఉండాలి. 291 నుంచి 320 మందికి 9 మంది టీచర్లు, 321 నుంచి 360 వరకు విద్యార్థులుంటే 10 మంది, 361 నుంచి 400 వరకు విద్యార్థులకు 11 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంది. కానీ ఈ విధానం చాలా పాఠశాలల్లో అమలుకావడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement