Friday, April 26, 2024

తెలంగాణలో పెట్టుబడులకు కిటెక్స్ సుముఖత

కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్  గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణలో పర్యటించింది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్ర‌తినిధులు స‌మావేశం అయ్యారు. కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ వస్త్ర వ్యాపార సంస్థ కైటెక్స్.. తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని యోచిస్తోంది. ఈ సంద‌ర్భంగా జౌళి రంగంలో పెట్టుబ‌డుల యోచ‌న‌పై మంత్రితో ఆ బృందం చ‌ర్చించింది. పారిశ్రామిక విధానాలు, జౌళి రంగంలో అవ‌కాశాల‌ను మంత్రి కేటీఆర్ వారికి వివ‌రించారు.

తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను వివరించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న టియస్ ఐ పాస్ సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగుతున్న అత్యుత్తమ కాటన్ పంట వంటి అంశాలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టియస్ ఐపాస్ చట్టప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందం కీటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ కు వివరించింది. తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా కేరళ అవతల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ ఆసక్తి/ప్రతిపాదన పట్ల స్పందించిన తీరు పైన ప్రశంసలు కురిపించింది. ఇంత వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం చాలా అరుదు అని కిటెక్స్  గ్రూప్ ప్రతినిధి బృందం పేర్కొంది.

ఇది కూడా చదవండి: టీ.టీడీపీకి ఎల్‌.రమణ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement