Saturday, May 4, 2024

21న బాధ్యతలు స్వీకరించనున్న కిషన్‌రెడ్డి.. అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాలో ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆ బాధ్యతలను ఈ నెల 21న అధికారికంగా స్వీకరించబోతున్నారు. ఈ మేరకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి చాంబర్‌ సిద్ధమవుతోంది. వాస్తవానికి 20రోజుల క్రితమే కిషన్‌రెడ్డి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనా ఆషాడ మాసం నేపథ్యంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆషాడం పూర్తయి శ్రావణమాసం మొదలైన నేపథ్యంలో ఈ నెల 21న ఆయన అధికారికంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కిషన్‌రెడ్డి బుధవారం రాత్రి తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ఢిల్లిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి త్వరలో రానున్న తెలంగాణ అసెంబ్లి ఎన్నిలకు పార్టీ శ్రేణులను ఎలా సంసిద్ధం చేయాలన్న అంశంతోపాటు కీలక నేతల వ్యవహారశైలిపైనా చర్చించనున్నారు.

తొలిపర్యటన ఖమ్మం జిల్లాలో…

- Advertisement -

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనను ఈ నెల 23న ఖమ్మం జిల్లాలో కిషన్‌రెడ్డి జరపనున్నారు. ఈ నెల 29న ఖమ్మంకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఖమ్మంలో ప్రిపరేటరీ మీటింగ్‌ను కిషన్‌రెడ్డి నిర్వహించనున్నారు.

కొన్ని పోర్టిఫోలియోలు వదులుకునే అవకాశం…

అటు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, ఇటు కేంద్ర మంత్రి బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడం భారంగా పరిణమించే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా తన పోర్టిఫొలియోలో నుంచి ఈశాన్య రాష్ట్రాలు, సాంస్కృతిక సంబంధాల విభాగాలను ఆయన వదులుకుంటారని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. పర్యాటకశాఖ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తూ అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారని నేతలు చెబుతున్నారు.

డబుల్‌ ఇళ్లపై ఉద్యమం…

తెలంగాణకు చేరుకున్న తర్వాత ఈ నెల 20న బాటసింగారంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. భారీ కాన్వాయ్‌తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు డబుల్‌ ఇళ్ల పంపిణీలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన మార్కు పనితీరును కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యనేతలు చెబుతున్నారు. డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై 24న జిల్లా కేంద్రాల్లో, 25న ఇందిరా పార్కు వద్ద ధర్నాలకు బీజేపీ రూపకల్పన చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement