Tuesday, April 30, 2024

Delhi: అబద్ధాలు, క‌ట్టు క‌థ‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తున్న కేసీఆర్… డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క‌

కేసీఆర్ మాటల్లో కొంచెం కూడా వాస్తవం లేదని, కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండిప‌డ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతలా అబద్ధాలు చెబుతారా? ఇలా దిగజారుతారా? ఆయన మాట్లాడుతుంటే మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలని అబద్ధాలు మాట్లాడారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలామంది కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తాను కట్టిన ఇంటిని తానే తగులబెట్టి పోయారని విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేశారని ఆరోపించారు.

బొగ్గు లభించే ప్రాంతానికి 350 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఉందని, దూరంగా ఉండటం వల్ల థర్మల్ పవర్ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చవుతోందన్నారు. అలాగే పర్యావరణ అనుమతులు పొందడంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. తెలంగాణకు 4వేల కోట్ల మెగా వాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాల్సి ఉందని… కానీ కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్‌ను చేపట్టారన్నారు.

కాళేశ్వరంలో జరిగిన పొరపాటును కేసీఆర్ ఇప్పటికి ఒప్పుకోవడం లేదని అన్నారు. ప్రజలకు తప్పదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్టీపీసీ విషయంలోనూ అబద్ధాలు చెప్పారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగానే కరెంట్ సరఫరా జరగుతోందని వెల్లడించారు. ఒక్క విద్యుత్ రంగంలోనే రూ.1,10,690 కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement