Saturday, May 4, 2024

Open Letter – లిక్క‌ర్ స్కామ్ తో సంబంధం లేదు…ఈడీ కోర్టు న్యాయ‌మూర్తికి క‌విత లేఖ‌

ఈడీ కోర్టు న్యాయ‌మూర్తికి క‌విత లేఖ‌
ఈ కేసులో బ‌లిప‌శువుని చేశారంటూ ఆవేద‌న
రెండున్న‌ర ఏళ్లు విచార‌ణ చేసిన ఒక్క ఆధారం లేదు
సిబిఐ, ఈడీ విచార‌ణ కంటే మీడియా విచార‌ణ‌కే ఎక్కువ‌
అన్ని ఫోన్ లు అంద‌జేసినా…
డేటా నాశ‌నం చేశారంటూ ఆరోప‌ణ‌లు
కేంద్ర సంస్థ‌లు పెట్టే కేసుల‌న్నీ విప‌క్ష నేత‌ల‌పైనే
విచార‌ణ‌కు సంపూర్ణంగా స‌హ‌కరిస్తా
బెయిల్ ఇవ్వ‌వ‌ల‌సిందిగా అభ్య‌ర్ద‌న

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ క‌విత స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తాను బాధితురాలినని.. లిక్కర్ కేసులో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆమె ఈడీ కోర్టు న్యాయ‌మూర్తికి నాలుగు పేజీలు లేఖ రాశారు.
తాను తప్పు చేశాననడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. రెండున్నరేళ్ల కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితుల స్టేట్మెంట్‌తో తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో మీడియా ట్రైలర్ ఎక్కువ జరుగుతుందని.. సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందన్నారు.

త‌న‌ మొబైల్ నెంబర్‌ను అన్ని ఛానల్‌లో వేసి నా ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు. త‌న‌ రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు హాజరయ్యా.. తన బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు నా ఫోన్లను కూడా అందజేశానని.. కానీ వాటిని ధ్వంసం చేసినట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

ఈడీ, సీబీఐ నమోదు చేస్తోన్న 95 శాతం కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవేనని.. బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి ‘నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతాం’ అని బీజేపీ నేతలు అన్నారన గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ కేసు విచారణకు పూర్తిగా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు బెయిల్ మంజారు చేయాలని అభ్యర్థిస్తున్నానని కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement