Monday, April 29, 2024

అన్నం పెట్టే రైతులపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : అన్నంపెట్టే రైతులపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష్య అని ఎమ్మెల్యే దాసరి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… 3 గంటలు కరెంట్ ఇవ్వాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను గోస పెడతారని, రైతులను పొట్టన పెట్టుకుంటారన్నారు.

రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. రైతు బాగుపడితే చూడలేని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని,కాంగ్రెస్ వస్తే 3గంటల కరెంట్ మాత్రమే ఇస్తారని, రైతు బంధు బంద్ కట్ చేస్తారన్నారు. మోటార్లకు మీటర్లు పెడ్తమంటే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు ఆత్మహత్యలేనని, బీఆర్ఎస్ పార్టీయే రాష్ట్రానికి, రైతులకు శ్రీరామ రక్ష అన్నారు.తెలంగాణ ప్రజలే నా కుటుంబం అని చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని, రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలంగాణలో అమలవుతున్న పథకాలను అందించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి నాయకులు, రైతులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement