Sunday, May 19, 2024

దేశంలో ఖాళీగా ఉన్న 16 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డంలో కేంద్రం నిర్ల‌క్ష్యం : మంత్రి హ‌రీశ్ రావు

పెద్ద‌ప‌ల్లి : దేశంలో ఖాళీగా ఉన్న 16 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డంలో కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న నిరుద్యోగ యువ‌త‌పై బీజేపీ అక్ర‌మ కేసులు బ‌నాయించి, బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం స‌రికాద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మంథ‌నిలో మాతా శిశు సంరక్ష‌ణ కేంద్రాన్ని మంత్రులు హ‌రీశ్‌రావు, కొప్పుల ఈశ్వ‌ర్ క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. బీజేపీ అన్యాయాల‌ను ఈ దేశ యువ‌త స‌హించ‌లేక‌పోతుంద‌న్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 16 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డంలో కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌న్నారు. కేంద్రంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నింటినీ అమ్మి సొమ్ము చేసుకుంటోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. దేశాభివృద్ధిని కేంద్రం గాలికి వ‌దిలేసింద‌న్నారు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో బీజేపీ మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతూ రాజ‌కీయంగా ల‌బ్ది పొందే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఏడేండ్ల‌లోనే ఇరిగేష‌న్, ఎడ్యుకేష‌న్, మెడిక‌ల్‌తో పాటు అన్ని రంగాల్లో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి సాధించామ‌ని మంత్రి తెలిపారు. కొత్త‌గా రాష్ట్రంలో 30 వైద్య కాలేజీల ఏర్పాటు చేశామ‌న్నారు. ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో కొత్త‌గా నాలుగు వైద్య క‌ళాశాలల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement