Friday, December 6, 2024

బీఆర్ఎస్ తో దేశాభివృద్ధి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మూన్ ఫంక్షన్ హాల్ లో 30వ వార్డు కౌన్సిలర్ హాబీబా బేగం ఖదీర్ ఖాన్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ… తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దేశ ప్రజలందరికీ తెలంగాణ పథకాలు అమలు చేసి అన్ని రంగాల్లో భారత దేశాన్ని అభివృద్ధి పరచాలని కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారన్నారు. 24 గంటల విద్యుత్‌, తాగునీరు, సాగునీరు, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని పార్టీల నాయకులు గులాబీ కండువా కప్పుకుంటున్నారన్నారు. 40 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎనిమిది ఏళ్లలో పెద్దపల్లి నియోజకవర్గంలో చేసి చూపామని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి తో పాటు ప్రజాప్రతినిదులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement