Monday, April 29, 2024

TS: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్, సెప్టెంబర్ 13 (ప్రభ న్యూస్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలో నరసయ్య పల్లి గ్రామంలో రూ.20లక్షలతో నిర్మాణం చేపడుతున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శిధిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల స్థానంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి గ్రామ ప్రజలకు పరిపాలన సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్డు అనేది లేకుండా అన్ని బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గ్రామీణ ప్రాంతాలకు అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో పెద్దపెల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, సర్పంచ్ సుంకే లావణ్య, వెంకటేష్, గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు తిరుపతితో పాటు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement