Tuesday, May 14, 2024

Thanks To All – బండి భావోద్వేగం … అనుకున్న‌వి ఏవీ జ‌ర‌గవంటూ వైరాగ్యం …

క‌రీంన‌గ‌ర్ – తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి అధికారికంగా వీడ్కోలు పలుకుతున్నానని , మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతుంటాయి అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించిన బీజేపీ అధిష్ఠానం, ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయ‌న భావోద్వేంతో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. తన పదవీకాలంలో విచారించదగ్గ ఘటనలేవీ లేకపోవడం సంతోషదాయకమని, అందరూ కూడా మర్చిపోలేని మధురానుభూతులు అందించారని పేర్కొన్నారు. అరెస్టుల సమయంలో, దాడులకు గురైన సమయంలో, ఉల్లాసంగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి నిలిచారని ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటంలో కార్యకర్తల పాత్ర ఎనలేనిదని, వారికి హేట్సాఫ్ చెబుతున్నానని వెల్లడించారు.

అరెస్ట్ లకు, దాడులకు భయపడకుండా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. వాన లేదు, ఎండా లేదు… కార్యకర్తలు అన్ని వేళలా తనకు తోడుగా ఉన్నారని బండి సంజయ్ ప్ర‌శంస‌లు కురిపించారు. తన పదవీకాలంలో పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని కోరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో మద్దతు ఇచ్చి, ప్రేమాభిమానాలు ప్రదర్శించిన కార్యకర్తలకు, ప్రోత్సహించిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి, తెలంగాణ బీజేపీ నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. ప్రజాసంగ్రామ యాత్రలో మనస్ఫూర్తిగా స్వాగతించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన కరీంనగర్ ఓటర్లకు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బండి సంజయ్ వివరించారు.

“నేను ఎప్పటికీ కార్యకర్తల్లో ఒకడినే, ఇకపైనా కార్యకర్తగానే ఉంటా. తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అభ్యున్నతి కోసం నవ్యోత్సాహంతో కృషి చేస్తాను” అని తెలిపారు.. తనలాంటి సాధారణ కార్యకర్తకు పెద్ద అవకాశం ఇచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ అగ్రనేతలు బీఎల్ సంతోష్, శివప్రకాశ్, సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్వింద్ మీనన్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement