Tuesday, April 30, 2024

అంతర్‌ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగల ముఠా అరెస్ట్‌..

  • పోలీసుల అదుపులో 11 మంది
  • 2.07 క్వింటాళ్ల కాపర్‌ వైరు స్వాధీనం

పెద్దపల్లి : ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 31 ట్రాన్స్‌ఫార్మర్లు దొంగలించిన నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి నేరం చేసేందుకు ఉపయోగించిన వాహనాలతో పాటు 2.07 క్వింటాళ్ల కాపర్‌ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చెన్నూరి రూపేష్‌ నిందితుల వివరాలను వెల్లడించారు. శుక్రవారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్‌ ఎస్సై ఉపేందర్‌ ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌ మండలంలోని కనుకుల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బసంత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన పండరి రఘు, పండరి నరేష్‌, పండరి వెంకటేశంతో పాటు- ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన మౌటం కుమార స్వామిలను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద నుండి కాపర్‌ వైరు స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారన్నారు. విచారణలో 9 మంది ముఠాగా ఏర్పడి పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 18, బసంత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2, అంతర్గాం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3, సుల్తానాబాద్‌లో 1, జూలపల్లిలో 1, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 6 ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసి అందులోని కాపర్‌ వైర్‌ను అమ్ముకున్నట్లు- గుర్తించామన్నారు. అనంతరం బసంత్‌ నగర్‌ ఎస్‌ఐ మహేందర్‌, ధర్మారం ఎస్సై శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పాటు- చేసి మొత్తం తొమ్మిది మంది నిందితులతో పాటు ఇద్దరు కొనుగోలు దారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి 2.07 క్వింటాళ్ల కాపర్‌ వైరు, ఒక కారు, ఒక టాటా ఏసీతో పాటు 6 ద్విచక్ర వాహనాలు, వేయింగ్‌ మెషిన్‌, కాపర్‌ వైర్‌ తీసేందుకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్రాన్స్‌ ఫార్మర్ల చోరీకి పాల్పడిన పండరి రఘు, పండరి నరేష్‌, పండరి వెంకటేశం, వేంపల్లి సతీష్‌, ధర్మాజీ ప్రభాకర్‌, అరుగుల శ్రీకాంత్‌, ముచ్చర్ల ప్రశాంత్‌, పండరి రాజేందర్‌, అరుగుల రజనీకాంత్‌తో పాటు- కాపర్‌ వైర్‌ కొనుగోలు చేసిన మౌటం కుమార స్వామి, పస్తం హనుమంతులను అదుపులోకి తీసుకున్నామన్నారు. గత కొన్ని నెలలుగా పెద్దపెల్లి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు పెరగడంతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్ర శేఖర్‌ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేన రెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రదీప్‌ కుమార్‌లు ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలపై దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసిన ఏసీపీ, సీఐలను సుల్తానాబాద్‌ ఎస్సై ఉపేందర్‌, ధర్మారం ఎస్‌ఐ శ్రీనివాస్‌, బసంత నగర్‌ ఎస్సై మహేందర్‌, ఏఎస్‌ఐ తిరుపతి, సిబ్బంది తిరుపతి నాయక్‌, అనిత్‌, గణష్‌, సుందర్‌, సతీష్‌, రవీందర్‌లను అభినందించడంతో పాటు- నగదు రికార్డ్‌లను అందజేశారు. మీడియా సమావేశంలో ఏసీపీ సారంగపాణి, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్‌ కుమార్‌తో పాటు- ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement