Saturday, May 4, 2024

Investment – రండి… తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి…స్పెయిన్ పారిశ్రామిక వేత్త‌ల‌కు జూప‌ల్లి పిలుపు

మాడ్రిడ్ – స్పెయిన్ – తెలంగాణ‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆకర్షణీయమైన పర్యాటక విధానాన్ని రూపొందించే ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ప్రఖ్యాతిగాంచిన ‘FITUR -2024’ పేరుతో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్ లో పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి జూపల్లి వివరించారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతోనూ మంత్రి ముచ్చటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 3,500 కోట్ల రూపాయలతో భారీ ప్రణాళికలు చేపట్టామని, కేంద్రపర్యాటక శాఖ మంజూరు చేసిన 300 కోట్ల రూపాయలతో వివిధ పర్యాటక మౌలిక సదుపాయ ప్రాజెక్టుల పనులు దాదాపు పూర్తి కావచ్చయని వెల్లడించారు. చారిత్రక కట్టడాలు, కోటలు, వారసత్వ భవనాలు, కళలు, కళాఖండాలు, భిన్న ఆహార రుచులు, మ్యూజియంలతో పాటు మెడికల్‌, హెల్త్‌, అడ్వెంచర్‌ , స్పోర్ట్స్‌ , ఆధ్యాత్మిక, ఎకో టూరిజం వంటి వాటికి తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, బుద్దవనం లాంటివి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు తార్కాణంగా నిలుస్తున్నాయని తెలిపారు.

కొత్త అనుభూతులు, అన్వేషించని ప్రదేశాలను చూడాలని కోరుకునే నేటి తరం పర్యాటకులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్దంగా ఉందని, ఘనమైన వారసత్వ సంపదతో అలరారుతున్న తెలంగాణ రాష్ట్రం ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. టూరిజం బ్రాండ్‌గా ఎదగాలన్న మా లక్ష్యంలో భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ లో మన రాష్ట్రానికి చెందిన కళాఖండాలు, హస్తకళలను ప్రదర్శించారు. బోనాలు, పోతురాజులు విన్యాసాలు, కూచిపూడి, భరత నాట్యం, ఒగ్గు డోలు కళాకారులు అద్బుత ప్రదర్శనలతో అదరగొట్టారు. తెలంగాణ పిండి వంటల రుచులను పర్యాటకులకు పరిచయం చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను మిస్ వరల్డ్ స్పెయిన్ పౌల ప్రెజ్ సంచేజ్ తో పాటు విదేశీ పర్యాటకులు సందర్శించారు. ఈ ‘FITUR ‘లో 131 దేశాలకు చెందిన 8,500 మంది ప్రతినిదులు పాల్గొన్నారు.

అంతకుముందు తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం ప్రముఖ ట్రావెల్ & టూరిజం వాటాదారులతో మంత్రి జూపల్లి చర్చించారు. “తెలంగాణ – ద హార్ట్ ఆఫ్ ద డెక్కన్”గా విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచే అంతిమ లక్ష్యంతో చేపట్టిన ప్రణాళికలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల, ఎండీ రమేష్ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement