Monday, April 29, 2024

Questioning – ఇది ద్వంద్వ నీతి కాదా మేడ‌మ్ గ‌వ‌ర్న‌ర్ …హారీష్ రావు..

హైదరాబాద్‌: గ‌వ‌ర్న‌ర్ ఎమ్మెల్సీ కోటాలో రాజ‌కీయ పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డం ప‌ట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై మాజీ మంత్రి , బిఆర్ఎస్ సీనియ‌ర్ నేత హరీష్ రావు ఫైరయ్యారు.. త‌మ అభ్య‌ర్ధుల‌ను తిర‌స్క‌రించి వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వంద్వ నీతి కాదా? అని గవర్నర్‌ను ప్రశ్నించారు.

ట్విట్టర్‌ వేదికగా ..’కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలైంది. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు. ఇది ద్వంద్వ నీతి కాదా?. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు?. రాష్ట్రంలో కాంగ్రెస్, రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement