Saturday, May 18, 2024

అన్నింటా సిరుల పంట! రిజిస్ట్రేషన్లలో రికార్డులు సృష్టిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రిజిస్ట్రేషన్ల పంట పండుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కార్‌ తీసుకునే నిర్ణయంతో ఇది మరింత ద్విగుణీకృతం కానున్నది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత స్థిర, చరాస్తుల క్రయ విక్రయాల జోరు తెలంగాణలో నమోదవుతోంది. ఆఫీస్‌ స్పేస్‌ రంగంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిల్చింది. ఐటీతోపాటు, వ్యవసాయం, రియల్‌ రంగాలు తెలంగాణ ఆర్ధిక ప్రగతికి చోధకాలుగా నిలుస్తున్నాయి. ఆయా రంగాల్లో ఆపూర్వ వృద్ధి, అద్భుత పురోగతి రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో పలు పరిశ్రనెమలు, దిగ్గజాలను తెలంగాణ ఆకర్శిస్తోంది. 2022-23 వార్షిక ఏడాది చివరి త్ర్రైమాసికానికి చేరుతున్న సమయంలోనే రూ. 5331.83కోట్ల రాబడిని రిజిస్ట్రేషన్ల వాఖ సమీకరించుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 599366 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ స్టాంపుల రూపంలో రూ. 5689కోట్ల రాబడి ఖజానాకు చేరింది. వచ్చే నెలాఖరునాటికి మరో రూ. 2000కోట్ల వరకు రాబడి ఆర్జించనున్నట్లు ఆర్ధిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రియల్‌ జోష్‌…

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. అనేక అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో సంస్థలను నెలకొల్పడం, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ పరిశ్రమలో అద్భుత గుర్తింపు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో భూములకు మంచి డిమాండ్‌ లభిస్తోంది. ఈ నేపథ్యంలో రియల్‌ రంగంలో పెట్టుబడులకు దేశంలోని అనేక ప్రాంతాలనుంచి పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి. ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలతోపాటు మేడ్చేల్‌, ఉప్పల్‌, శామీర్‌పేట వంటి శివారు ప్రాంతాల్లో క్రయవిక్రయాలు వేగంగా పెరిగాయి.

కీలక నిర్ణయాలతో అక్రమాలు మాయం…

అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్లను జరక్కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన వ్యవస్థను అమలులోకి తెస్తోంది. గతేడాదినుంచి స్థిరాస్తి క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో ఆధార్‌, పాన్‌ వివరాలను నమోదు చేయడం ప్రారంభమైంది. తద్వారా యుఐడిఏ, ఇన్‌కంటాక్స్‌ సర్వర్‌తో సరిపోల్చుకున్న తర్వాత, వివరాలు సరిగ్గా ఉన్నాయని తేలాకే రిజిస్ట్రేషన్లను చేయడం అమలవుతోంది.
ఇక ధరణి పోర్టల్‌లో కీలకమైన వివరాలను ప్రభుత్వం రెడీ చేస్తోంది. సర్వే ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం ఇంకా కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో ఒకే పేరుతో అనేక ఖాతాలు, రికార్డుల్లో పేరు మార్చకుండా ఉండిపోవడం, 1బి రికార్డుల్లో సమస్యలను నివారించడంతో క్లిష్ట సమస్యలు తీరాయి.

- Advertisement -

సమన్వయంతో అక్రమాలకు అడ్డుకట్ట…

గతంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల మధ్య సమన్వయలోపంతో అనేక భూములు పరాధీనమయ్యాయి. రికార్డుల్లోని లొసుగులు, నకిలీ పాస్‌పుస్తకాలతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతోపాటు ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో అసలు యజమానికి, రికార్డుల్లోని పేర్లకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయిన వివరాలను భూ రికార్డుల ప్రక్షాళనతో సరి చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను వసూళ్లలో శాస్త్రీయతతోపాటు, ఆస్తిపన్ను పరిధిలోకి రాని నివాసాలను గుర్తించి రాబడి పెంచుకోవచ్చనే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్తి పన్ను, ప్రకటనల పన్ను, ట్రేడ్‌ లైసెన్సుల రుసుములను వసూలు చేయడానికి మరింత పారదర్శకత వస్తుందని గుర్తించారు. ఈ విధానం అమలు చేస్తే 30నుంచి 40 శాతం రాబడి పెరుగుతుందని సర్కార్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. పురపాలక, నగర పాలక సంస్థలకు ఎంత ఆదాయం ఆర్జిస్తే ప్రభుత్వం అంతే మొత్తం ఇస్తోంది. దీంతో అధిక మొత్తం రాబడి సాధ్యమైతే అభివృద్ధికి నిధుల లోటు రాదని పురపాలక సంఘాలు అంటున్నాయి.

పలు రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం తాజాగా హైదరాబాద్‌ఆఫీస్‌ స్పేస్‌లో అగ్రగామిగా నిల్చింది. నిర్మాణ దశలోని గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్‌లో ప్రపంచంలోని అన్ని నగరాలను అలవోకగా దాటేసిన హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిల్చింది. టోక్యో, న్యూయార్క్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలను కూడా పక్కకి నెట్టేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 44 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్‌ ఉన్నట్లు గుర్తించారు. బెంగుళూరులో ఇది 39 మిలియన్‌ చదరపు అడుగులుగా తేలింది. ఈ అంశంలో ఢిల్లి మూడో స్థానంలో ఉంది. టోక్యో. ప్యారిస్‌, న్యూయార్క్‌ వంటి నగరాలు ఆ తర్వాత వరుసలో నిల్చాయి. అమెజాన్‌, కాగ్నిజెంట్‌, మైక్రోసాఫ్ట్‌,, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ క్యాంపస్‌లను హైదరాబాద్లో ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో రియల్‌ రంగం అత్యద్భుతంగా వెలుగొందుతోంది. ఇక ఫార్మా కంపెనీలు నిర్మాణ రంగంలోకి వెళుతున్నాయి. ఇది కూడా కలిసి వస్తోంది. హెటిరో, అరబిందో వంటి కంపెనీలు తమ ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణాలను హైదరాబాద్‌లో పరారంభించాయి.

టాప్‌ 10 నగరాల జాబితా…

నగరం గ్రేడ్‌-ఏ స్పేస్‌
హైదరాబాద్‌ 44
బెంగుళూరు 39
ఢిల్లి 25
టోక్యో 21.5
మ్యూనిచ్‌ 17
న్యూయార్క్‌ 16
ప్యారిస్‌ 16.7
లండన్‌ 15.7
చెన్నై 14.2

Advertisement

తాజా వార్తలు

Advertisement