Friday, May 17, 2024

Big story | పది పరీక్షలు కాకముందే ఇంటర్‌ అడ్మిషన్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంకా పదో తరగతి పరీక్షలు ప్రారంభమే కాలేదు..అప్పుడే టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు పలు కార్పొరేట్‌ కాలేజీలు అడ్మిషన్ల కోసం గాలం వేస్తున్నారు. అడ్మిషన్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. పదో తరగతిలో పాసైన తర్వాత ఇంటర్మీడియట్‌ కోసం విద్యార్థులు ఏ కళాశాలలో చదివితే బాగుంటుందని వారి తల్లిదండ్రులు కాలేజీల గురించి ఆరా తీస్తారు.

ఆ కళాశాలను సందర్శించి సదరు కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, అనుభవం గల అధ్యాపకులు, ల్యాబ్‌లు, ఉత్తమ ఫలితాలు తదితర అంశాలను బెరీజు వేసుకొని అప్పుడు తమకు నచ్చిన కాలేజీలో జాయిన్‌ అవ్వడానికి ఆసక్తి చూపుతారు. అయితే 2024-25విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో అడ్మిషన్లు తీసుకోవడానికి ఇంకా చాలా సమయమే ఉంది. పరీక్షలు జరగాలి, ఫలితాలు రావాలి.. ఆ తర్వాత అడ్మిన్ల ప్రక్రియ మే.. జూన్‌లో మొదలవుతోంది. కానీ ఇప్పటి నుంచే కొన్ని కార్పోరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇంటర్‌ అడ్మిషన్లను చేపడుతున్నాయి.

2024-25 విద్యాసంవత్సరానికి అప్పుడే సీట్లు అయిపోయినట్లు కృత్రిక కొరతన సృష్టిస్తున్నారు. తమ కాలేజీలో సీట్లు పరిమితంగా ఉన్నాయని కనీసం అఫిలియేషన్‌ దరఖాస్తులకు కూడా ఇంటర్‌ బోర్డు ఆహ్వానించక ముందు నుండే పేరెంట్స్‌ని బురిడీ కొట్టిస్తూ ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల పేరు చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అడ్మిషన్‌ తీసుకుంటే ఒక రేటు..తర్వాత తీసుకుంటే మరో రేటు అంటూ మాయమాటలు చెబుతూ దందా చేసుకుంటున్నాయి. కొన్ని సీట్లను బ్లాక్‌ చేసి…వాటిని తీరా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు చివరి క్షణంలో వచ్చిన వారికి తమకు అనుకూలమైన ఫీజులకు అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి.

- Advertisement -

పీఆర్‌వో వ్యవస్థలను పెట్టి పల్లెలకూ ఇప్పటి నుంచే పంపిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. హాస్టల్‌ ఉంటే ఒక రేటు… హాస్టల్‌ లేకుంటో మరో రేటును ఫిక్స్‌ చేస్తున్నారు. నీట్‌, జేఈఈ కోచింగ్‌ అంటూ అదనంగా నొక్కుతున్నారు. సుమారుగా రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్లు అయిపోకముందే మొత్తం నిండిపోయినట్లు కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు. వీరి మాయలో పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తర్వాతైతే తమ పిల్లలకు సీటు దొరుకుతుందోలేదోనన్న ఆందోళనతో రూ.లక్షలు పోసి ముందస్తుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

అసలు పదవ తరగతి పూర్తికాకుండానే ఇంటర్‌ అడ్మిషన్లు ఎలా చేపడుతారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న కళాశాలల్లో సీట్లు ఎప్పుడో నిండిపోయాయి. ఒకవేళ ఇప్పుడు కావాలంటే ఫైరవీలు ఉంటేగానీ దొరకడం కష్టమైపోయింది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కూడా ఆయా కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యాలు డబ్బు యావలో అడ్మిషన్ల ప్రక్రియకు ముందే అడ్మిషన్లను చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం పదో తరగతి ఫలితాల తర్వాత ఇంటర్మీడియట్‌ కళాశాలలో ప్రతిఏటా బోర్డు నుండి అనుబంధ గుర్తింపు పొందిన తర్వాత ఇంటర్‌ బోర్డు ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది.

బోర్డు నుంచి కళాశాలకు గుర్తింపు ఉందా? లేదా? అని చెక్‌ చేసుకొని అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవేమీ చూసుకోకుండానే కార్పొరేట్‌ మాయలోపడి విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగైదు నెలల ముందే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అయితే ఇదంతా సంబంధిత విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్టు-గా వ్యవహరిస్తున్నారు. అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే కృత్రిమ డిమాండ్‌ సృష్టించి సీట్లు అమ్ముకుంటున్న కార్పొరేట్‌ కళాశాలలను కట్టడి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement