Saturday, May 4, 2024

సంచిలో డబ్బులు, జేబులో సరుకులు.. పెరిగిన ధరలతో పేదలు విలవిల

ఇటీవలి కాలంలో రోజురోజుకు ధరలు పైకిపైకి ఎగ బాకుతున్నాయి. పెరుగుతున్న కూరగాయల ధరలతో పేద, సామాన్య కుటుంబాల ప్రజలు విలపిస్తున్నారు.. ఇప్పటికే మార్కెట్‌లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏది కొనాలన్నా ఇప్పుడు మార్కెట్‌లో రూ.50 పైగానే ఉన్నాయి. పచ్చి మిర్చి ధర మరీ ఘాటెక్కింది. వారం రోజుల కింద రూ.30 కిలో ఉన్న ధర ఇప్పుడు రూ.70కి చేరి, బీరకాయతో పోటి పడుతోంది. ఇదివరకు రూ.30కి కిలో వచ్చే బీరకాయ ధరలు ఇప్పుడు రూ.70 పలుకుతోంది. కాకర, కాలీప్లవర్‌, క్యాబేజీ, దొండ, దోస వంటి కూరగాయల్లో ఏది కొనాలన్నా సామాన్యులు కొనలేక పోతున్నారు. అవి సైతం ఇప్పుడు మార్కెట్‌లో కిలోకు రూ.50కి చేరాయి.

ఆకు కూరలతో కాలం గడుపుదామా అంటే, వాటి ధరలు సైతం చుక్కలనంటాయి. పది రోజుల క్రితం వరకు రూ.30కి కిలోకు వచ్చిన పాలకూర ప్రస్తుతం రూ.80కి చేరింది. ఉల్లి, మెంతి, కొత్తిమీర, ధరలైతే అమాంతం పేరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఎండకాలంలో కిలో రూ.8 నుంచి రూ.10లకు పలికిన ఉల్లిగడ్డ ధరలు ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వరకు పెరిగి సామాన్యకుటుంబాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత ఏడాది ఇదే నెలలో టమాట రూ.10 మాత్రమే ధర పలికింది. ప్రస్తుతం ఇప్పుడు కాస్తా రూ.30కి చేరింది. మిర్చి గత సంవత్సరం ఇదే సమయంలో కిలో రూ.20 నుంచి రూ.25కి అమ్మకాలు జరిపేవారు. ప్రస్తుతం టమాట, ఉల్లి, ఆకు కూరల ధరలు ఇప్పుడు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి.

వర్షాలే కారణం కాదు…

కూరగాయల ధరలు పెరుగడంలో ఒక వర్శాలే కారణం కాదనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతేడాది కూరగాయల ధరలు విపరీతంగా పడిపోవడంతో ఈ సారీ రైతులు ఎక్కువగా సాగు చేయలేదు. దీనికి తోడు గడిచిన నెల మొదటి వారంలో కురిసిన‌ వర్శాలకు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. క్రితం సంవత్సరం అధిక శాతం కూరగాయలు స్థానికంగానే పండించే వారు, ముఖ్యంగా టమాట సాగు పెద్ద మొత్తంలో చేయడంతో అవసరానికి మించి దిగుబడులు వచ్చాయి. అయితే టమాట ధరలు మార్కెట్‌లో పలుకక పోవడంతో ఈ సారీ రైతులు టమాట సాగు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో టమాట సాగు చేయడం తగ్గించారు. అయితే ప్రస్తుతం జిల్లా ప్రజలకు అవసరానికి సరిపడే కూరగాయలు లేక పోవడంతో ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకొంటున్నారు. దీంతో మార్కెట్లో ధరలు పెంచి అమ్మకాలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement