Tuesday, April 30, 2024

Breaking: సెల్లార్​ గుంత తవ్వుతుంటే ప్రమాదం… ముగ్గురు మృతి?, ఈఐపీఎల్ సంస్థ నిర్ల‌క్ష్యమే కారణం!

హైదరాబాద్​లోని మణికొండ మున్సిపాలిటీ ప‌రిధి.. పుప్పాల‌గూడ గ్రామంలో ఇవ్వాల ఘోర ప్రమాదం జరిగింది. ఈఐపీఎల్ సంస్థ నిర్మిస్తున్న బ‌హుళ అంత‌స్తుల భ‌వనానికి సంబంధించిన సెల్లార్​ కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టారు. డ‌బుల్ సెల్లార్ కోసం ప‌నులు చేస్తుండ‌గా ఇవ్వాల (శనివారం) అక‌స్మాత్తుగా మ‌ట్టిపెల్ల‌లు కూలి ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక మృతదేమాన్ని మట్టి పెల్లల నుంచి బయటికి తీయగా.. మరో ఇద్దరు ఇంకా మట్టి పెళ్లల కిందనే ఇరుక్కుపోయారు.

కాగా, ఈఐపీఎల్ సంస్థ నిర్మాణ ప‌నుల్లో తీసుకోవాల్సిన కనీస జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అందరూ భావిస్తున్నారు. మ‌ట్టి శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియ‌డం లేద‌ని స్థానికులు అంటున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే నార్సింగ్ ఎస్ఐ అనిల్ హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.


గుడిని, బావిని మింగిన ఈఐపీఎల్..
పుప్పాల‌గూడ క‌ల్లు కాంపౌండ్ ప‌క్క‌న బ‌హుళ అంత‌స్తుల నిర్మాణం చేప‌డుతున్న ఈఐపీఎల్ సంస్థ అక్క‌డి పురాత‌న గుడిని, బావిని మింగేసింది. నిజాం కాలం నాటి నిర్మాణాల‌ను మాయం చేసిన నిర్మాణ సంస్థ య‌థేచ్ఛ‌గా అక్ర‌మాల‌కు తెగ‌బ‌డిన‌ట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


స‌మాదులు కూడా మాయం…
బ‌హుళ అంత‌స్థులు నిర్మాణం జ‌రుగుతున్న ప్ర‌దేశంలో నిజాం కాలం నుంచి ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన కొంత‌మంది వ్య‌క్తుల స‌మాధులు ఉండ‌గా, వాటిని ఈఐపీఎల్ మాయం చేసిన‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -

రోడ్డు కూడా కబ్జా..

మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌కారం 40 అడుగుల ర‌హ‌దారి ఉండ‌గా.. ఈఐపీఎల్ యాజ‌మాన్యం అక్ర‌మ మాస్ట‌ర్ ప్లాన్ ను ఏర్పాటు చేసి అధికారుల‌ను నోట్ల క‌ట్ట‌ల‌తో నోరు మూయించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ఆక్ర‌మ‌ణ వ‌ల్ల‌ తాము నిత్యం ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఈఐపీఎల్ సంస్థ‌పై ఆప్రాంత వాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈఐపీఎల్ చేస్తున్న అక్ర‌మాలు వారికి శాపాలుగా మారాయ‌ని పుప్పాల‌గూడ వాసులు చ‌ర్చించుకుంటున్నారు. వారి చేసిన నిర్ల‌క్ష్యానికి అమాయ‌క కూలీలు మృతిచెందిన‌ట్లు విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న ఈఐపీఎల్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సెల్లార్​ కోసం గుంతలు తీయొద్దన్న ఆదేశాలున్నా ఈ సంస్థ పట్టించుకోకుండా నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతోంది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే జీహెచ్​ఎంసీ అధికారులు ఏప్రిల్​ 30వ తేదీన దీనికి సంబంధించి సర్క్యులర్​ జారీ చేశారు. ఏ నిర్మాణ సంస్థ కూడా సెల్లార్​ కోసం తవ్వకాలు చేపట్టొద్దని ఆ నిబంధనల్లో పేర్కొన్నారు. అయినా ప్రభుత్వ ఆదేశాలు కానీ, అధికారుల మాటలను పట్టించుకోకుండా ఈఐపీఎల్​ నిర్మాణ సంస్థ తవ్వకాలు చేపట్టి ముగ్గురి మరణానికి కారణమయ్యింది.

ఇవిగో జీహెచ్​ఎంసీ జారీ చేసిన నిబంధనల వివరాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement