Thursday, April 25, 2024

Story : సినీ రంగంలో కొన‌సాగుతోన్న ట్రెండ్- హిట్ట్ కొట్టు – గిఫ్ట్ ప‌ట్టు

సినీ ప్ర‌పంచంలో ఇప్పుడో ట్రెండ్ న‌డుస్తోంది. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు స‌ద‌రు సినిమా హీరో..ద‌ర్శ‌కులు..నిర్మాత‌లు గిఫ్ట్స్ ఇచ్చుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. గిప్ట్స్ అంటే ఏదో అల్లాట‌ప్పా బ‌హుమ‌తులు కాదండోయ్..ఖ‌రీదైన‌..అతి ఖ‌రీదైనవి కూడా.. ఈ ట్రెండ్ ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. టాలీవుడ్..బాలీవుడ్..కోలీవుడ్ అనే తేడాలు లేకుండా ఈ గిప్ట్ల పంపిణీ జ‌రుగుతుండ‌టం విశేషం. ఇది మంచి ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. విక్రమ్ చిత్రం సూపర్ సక్సెస్ తర్వాత విశ్వ న‌టుడు కమల్ హాసన్ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. దానికి కమల్ హాసన్ కు లోకేష్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. లోకేష్ కనగరాజ్ కి లగ్జరీ కారు మాత్రమే కాదు.. విక్రమ్ లో అతిథి పాత్రలో నటించిన సూర్యకి కమల్ హాసన్ రోలెక్స్ వాచ్ ను బహుమతిగా ఇచ్చాడు. సూర్య ట్వీట్ చేస్తూ ”ఇలాంటి క్షణం జీవితాన్ని అందంగా చేస్తుంది! మీ #రోలెక్స్ కి ధన్యవాదాలు అన్నా అంటూ కమల్ పై ప్రేమను కురిపించారు.

ఇక పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ సక్సెస్ సాధించిన క్రమంలో ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ కి రాకింగ్ స్టార్ యష్ ఖరీదైన ఫోన్ ని కానుకగా ఇచ్చాడు. లక్షల్లో దీని విలువ ఉంటుంది. అలాగే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తి కాగానే తన టెక్నీషియన్లందరినీ ఇంటికి పిలిపించుకుని మరీ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ బంగారు నాణేలను కానుకగా ఇచ్చారు. వీటి విలువ లక్షల్లో ఉంది. ఇక చరణ్ చాలా సార్లు తన తండ్రి గారైన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన కారులను కానుకగా ఇచ్చారు. చెర్రీ కూడా చిరు నుంచి అందుకున్నారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి బండ్ల గణేష్ కానుకల గురించి తెలిసిందే. టాలీవుడ్ హీరోల్లో పలువురు తమ దర్శకులకు ఖరీదైన కార్ లను కానుకలుగా ఇచ్చిన సందర్భాలు అనేకం.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొదటిసారి ఈ జోడీ ‘కిక్’లో కలిసి నటించారు. అందులో జాక్వెలిన్ నటనకు సల్మాన్ ఎంతగానో ముగ్ధుడయ్యాడు. అతను ఆమెకు రూ. 2.50 కోట్లు ఖరీదైన కార్ ని కానుకిచ్చాడు. అమితాబ్ బచ్చన్ కోసం విధు వినోద్ చోప్రా బహుమతి ఇంతకుముందు చర్చకు వచ్చింది. విధు వినోద్ చోప్రా ‘ఏకలవ్య’లో నటించడానికి అమితాబ్ బచ్చన్ నామమాత్రపు పారితోషికాన్ని కోరారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెసవ్వలేదు. అయినప్పటికీ విధు వినోద్ బిగ్ బికి రోల్స్ రాయిస్ ఫాంటమ్ ను బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ అమితాబ్ కోసం ఈ కారును విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. క తాజాగా బాలీవుడ్ కి చాన్నాళ్ల తర్వాత అదిరిపోయే హిట్టిచ్చిన హీరో కార్తిక్ ఆర్యన్ మెక్ లారెన్ Gt కార్ ని అందుకున్నాడు. దేశంలో ఇదే మొట్టమొదటి మెక్ లారెన్ కార్..భూల్ భులయా 2 నిర్మాత భూషణ్ కుమార్ ఈ గిఫ్ట్ ని ఇచ్చి సర్ ప్రైజ్ చేసారు. ఇలా బ‌హుమ‌తులు ఇవ్వ‌డం హీరోలు..ద‌ర్శ‌కుల‌ని ఎంక‌రేజ్ చేసిన‌ట్ల‌నిపిస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దాంతో వారి మ‌ధ్య స్నేహ‌బంధం నెల‌కొనేందుకు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement