Sunday, April 28, 2024

తెలంగాణ అడవులు ప్రత్యేకమైనవి..

హైదరాబాద్ : తెలంగాణ అడవుల్లో కనిపించే విభిన్న జంతు జాతులపై జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని అరణ్యభవన్ లో అటవీ..పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ అడవులు ప్రత్యేకమైనవని, ప్రత్యేక వృక్ష జాతులకు తోడు, వైవిధ్యమైన, విభిన్న జంతుజాలానికి కూడా రాష్ట్ర అడవులు పేరుపొందాయని ..రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జంతుజాలంపై ఇది ప్రత్యేకంగా రూపొందించిన మొదటి పుస్తకమని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న రెండు పులుల సంరక్షణ కేంద్రాలు (అమ్రాబాద్, కవ్వాల్), ఏడు అభయారణ్యాలు (ప్రాణహిత, శివారం, ఏటూరునాగారం, పాకాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం), మూడు జాతీయ పార్కుల్లో (కేబీఆర్, మృగవని, హరిణ వనస్థలి) అధ్యయనం జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరుద్దరణ చర్యల వల్ల అడవుల్లో పర్యావరణం, జంతుజాలం బాగా వృద్ది చెందిందని తెలిపారు. తెలంగాణలో మొత్తం 2,450 రకాల జంతువులు, పక్షులు, పాములు, కీటకాల జాతులను గుర్తించినట్లు కార్యక్రమంలో పాల్గొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ కైలాష్ చంద్ర తెలిపారు. 1744 వెన్నుముక లేని జంతువులు, 706 రకాల వెన్నుముకతో కూడిన, కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే కనిపించే 82 రకాల జంతువులను తెలంగాణ అడవుల్లో గుర్తించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రాంతాల వారీగా కూడా సర్వే చేసి ప్రత్యేక పుస్తకాలు విడుదల చేస్తామన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ పులుల సంరక్షణ ప్రాంతాలు ప్రధానంగా తెలంగాణలో విశిష్ట జంతుజాలానికి కేంద్రాలుగా ఉన్నాయన్నారు. రాష్ట్రాలకు చెందిన కంపా నిధుల్లో నుంచి కేంద్రం పదిశాతం వెచ్చించి జీవ వైవిధ్యం, జంతుజాలంపై ప్రత్యేక అధ్యయనాలు చేయిస్తుందని, తద్వారా భవిష్యత్ కార్యకలాపాల రూపకల్పనకు ఈ ప్రచురణలు తోడ్పడుతాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ కు చెందిన భోజ్ చిత్తడి నేలలు- జంతుజాలంపై రూపొందించిన పుస్తకాన్ని కూడా మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, ఎం.సీ. పర్గెయిన్, ఏ.కే. సిన్హా, హైదరాబాద్ సీసీఎఫ్ ఎం.జె. అక్బర్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఇంఛార్జి డాక్టర్ దీపా జైస్వాల్, ఓఎస్డీ శంకరన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement