Wednesday, May 1, 2024

ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన.. మంత్రి త‌ల‌సాని

ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠాలు మంచిగా చెబుతున్నారా ?, భోజనం బాగుంటుందా ? అని పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలలో ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా అని పాఠశాల సిబ్బంది, విద్యాశాఖ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు తరగతి గదులు నిర్మించాల్సి ఉందని తెలపగా, ACDP నిధులతో నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలలో వివిధ తరగతి గదులకు వేసిన కలర్స్ ను పరిశీలించారు. వీటిలో త్వరలో ఒక కలర్ ను ఎంపిక చేసి ప్రభుత్వ అనుమతి అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అదే కలర్స్ వేయడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.7200 కోట్లు మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో 35 శాతం పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించడం, ప్రహరీగోడల నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన, యూనిఫామ్, పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన భోజనం అందిస్తున్న కారణంగా విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ రాజు, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఏసూరి మహేష్, ప్రేమ్ తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement