Friday, May 17, 2024

విద్యార్థులు లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలి : కిషోర్‌గౌడ్‌

విద్యార్థులు, నిరుద్యోగుల తాత్కాలికమైన ఆనందాలను సంతోషాలను పక్కనపెట్టి లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు కె.కిషోర్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. విద్యానగర్‌లోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రూప్ 3, గ్రూప్ 4, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందే నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సెంటర్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్‌గౌడ్‌ మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన వర్గాలను పైకి తీసుకురావడంకోసం ముఖ్యమంత్రి కెేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని అందుకు ఉదాహారణకు నూతనంగా 50 బీసీ స్టడీ సెంటర్‌లను ఏర్పాటు చేయడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు దక్కాలనే ఉద్ధేశ్యంతో జోనల్ వ్యవస్థను సరిచేసి 95శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేవిధంగా కొత్త జోనల్‌ వ్యవస్థను తీసుకురావడం వలన, దానిలో 95శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకే దక్కుతాయని తెలియజేశారు.

ఇప్పటికే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 3- 4 స్టడీ సెంటర్లు మాత్రమే ఉండేవని అవి కూడా నామమాత్రంగా శిక్షణ కేంద్రాలుగా ఉండేవన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 నూతన స్టడీ సెంటర్‌లను ఏర్పాటు చేసి, 365రోజులు అందులో వివిధ రకాల పోటి పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 85వేలకు పైగా ఉద్యోగాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటి కోసం సిద్దం కావాలనే ఉద్దేశ్యంతో మరొక 50 సబ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ పొంది మంచి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుకన్య, కోర్సు కో ఆర్డినేటర్‌ సుచిత్ర, పి.వి.ఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ వెంకటేశ్వర్‌రావు, జిల్లా సహాయ సంక్షేమశాఖ అధికారులు నర్సింహులు, సంజీవులు, యాసిర్‌ అలీ, పెద్ద ఎత్తున శిక్షణ తీసుకునే విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement