Sunday, April 28, 2024

ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొరత.. గంటల తరబడి క్యూ లైన్లో పేషెంట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సాధారణ తలనొప్పి, జ్వరానికి మందులు దొరకని దయనీయ పరిస్థితి ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో నెలకొంది. ప్రస్తుతం కరోనాతోపాటు సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తుండడంతో పలువురు కార్మికులు మంచనా పడుతున్నారు. ఈఎస్‌ఐ కార్డు ఉంది కదా..? అని ఆసుపత్రికి వెళితే అక్కడ కనీస సదుపాయాలు లేవని, చివరకు పారాసిటమాల్‌ మాత్ర కూడా దొరకడం లేదని వాపోతున్నారు. ప్రతి నెలా కార్మికుల వేతనాల నుంచి ఈఎస్‌ఐ మొత్తాన్ని మినహాయించుకున్నా … ఆ మేరకు వైద్య సేవలు అందించడంలో ఈఎస్‌ఐ యాజమాన్యం విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందులు దొరకకు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులు రాసిన మందుల చీటీలో కనీసం మూడు రకాల మందులు బయటనే కొనుక్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వైద్యులు రాసిన పూర్తి మందులు దొరకకపోవడంతో రెఫరల్‌ ఆసుపత్రిలో అడిగితే డిఎస్పెన్సరీలో తీసుకోవాలని, అక్కడ అడిగితే రెఫరల్‌ ఆసుపత్రిలో తీసుకోవాలని రోగులతో సిబ్బంది ఆటలాడుతుండడం గమనార్హం. డిస్పెన్సరీలో నిలదీసి అడిగితే మరోసారి ప్రత్యేక మెడిసిన్‌ కింద దరఖాస్తు చేసుకోవాలన్న సమాధానం సిబ్బంది నుంచి వస్తోందని రోగులు వాపోతున్నారు.

ప్రత్యేకంగా మందుల కోసం దరఖాస్తు చేసుకున్నా సకాలంలో వాటిని తెప్పించి ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 20లక్షల మందికి ఈఎస్‌ఐ కార్డుదారులు ఉన్నారు. వారి కుటుంబాలతో కలుపుకుని దాదాపు 80లక్షల దాకా ఈఎస్‌ఐ లబ్దిదారులు తెలంగాణలో ఉన్నారు. మందులు దొరక్కపోవడం, కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో కార్మికులు ఈఎస్‌ఐ కార్డు ఉన్నా ప్రయివేటు ఆసుపత్రిలో వేలకు వేలు, లక్షలకు లక్షలు చెల్లించి వైద్యం పొందాల్సి వస్తోంది. ముఖ్యంగా మందుల కొరత ఈఎస్‌ఐ కార్డుదారులను వేధిస్తోంది. వైద్యులు రాసిన మందుల పొందేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తోంది. తీరా సదరుకార్మికుడి వంతు వచ్చే సరికి మందులు లేవనే సమాధానం సిబ్బంది నోటి నుంచి వస్తోంది. దీంతో రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసలు రెఫరల్‌ ఆసుపత్రుల్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయి..?, డిస్పెన్సరీల్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయనే సమాచారం రోగులకు అందించాలని పలు కార్మిక, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement