Thursday, April 25, 2024

బీజేపీకి ఆస్తులను ప్రైవేట్ చేయడంలో ఉన్న శ్రద్ద కార్మికుల సమస్యల పై లేదు.. తలసాని

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ 30వ జాతీయ మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే శాఖకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సైతం వేలాది గూడ్స్ రైళ్ళను నడిపి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకులను సరఫర చేశారని, ప్రత్యేక రైళ్ళను నడిపి కార్మికులు తమ నిబద్దతను చాటుకున్నారన్నారు. 1962 లో చైనా దుకాక్రమణ సమయంలో, 1999 నాటి కార్గిల్ యుద్ద సమయంలో సైతం రైల్వే కార్మికులు 24 గంటల పాటు పనిచేసి యుద్ద ట్యాంక్ లను, ఇతర యుద్ద సామాగ్రిని సైనికులకు అందించడం జరిగిందన్నారు.

ఈ క్రమంలో 3200 మంది రైల్వే కార్మికులు కరోనా భారినపడి మరణించారని, నేటి వరకు వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఎక్స్ గ్రేషియా చెల్లించక పోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇన్సురెన్స్ లను ప్రైవేట్ పరం చేయడమే కాకుండా రైల్వేను కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు ఆందోళన చెందవద్దని, దేశం మొత్తం మీ వెంటే ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులు తలచుకొంటే దేశంలో ఒక్క రైలు కూడా కదలదని, మీరేమిటో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చూపెట్టే సమయం దగ్గరలోనే ఉందన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాటం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్, ఇంటింటికి త్రాగునీటి సరఫరా వంటి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ సమావేశంలో అద్యక్షులు గుమన్ సింగ్, జనరల్ సెక్రెటరీ రాఘవయ్య, వెంకట సుబ్బమ్మ, ప్రభాకర్ ఆడ్సు, భాను ప్రసాద్, శేఖర్ రాం, ఆడం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement