Thursday, May 2, 2024

Assembly – కూల్చ‌డానికి ఇది భ‌వ‌నం కాదు….ప్ర‌జా ప్ర‌భుత్వం – వేముల వీరేశం

హైద‌రాబాద్ – గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘాటు విమర్శలు చేశారు. దళితుల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం తీసేసిందని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతానన్నారు. కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారు? అని విపక్ష నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం దళితులను అణిఛివేస్తూ అవమానించారని ఆరోపించారు. మనిషిగా చూడని పార్టీ నుంచి గౌరవం లభించే పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలు కూల్చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్డింగ్‌ కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలకు అనుమతిలేని ప్రగతి భవన్‌ కంచెలు బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు. దళిత బంధు పేరుతో మభ్యపెట్టారని, అధికారంలో ఉన్నామని గర్వం ఉండకూడదన్నారు. అవమానించిన బీఆర్‌ఎస్‌ను విడిచిపెట్టి కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, పాలమూరు ప్రజలు బీఆర్‌ఎస్‌ నేతలని దూరం పెట్టారని, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. తమది దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వం అని, గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందన్నారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిందన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement