Thursday, May 2, 2024

24గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం.. రేవంత్ వ్యాఖ్యలు వక్రీకరించారు.. జ్ఞానేశ్వర్ ముదిరాజ్

రాజేంద్రనగర్ : రేవంత్ వ్యాఖ్యలపై విష ప్రచారం చేస్తున్నారని, రైతులకు 24 గంటల కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానమని రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించినందుకు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ… ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను సృష్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. త‌మ మేనిఫెస్టోలో మూడు గంటలే కరెంట్ ఇస్తామని రేవంత్ అనలేదని తెలిపారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ నిరసనలు చేయడం ఎక్కడైనా చూశామా అంటూ బీఆర్ఎస్‌కు చురకలంటించారు. అధికారంలో వున్న మీరు రైతులకు లాభం చేయరు, మేం చేస్తామంటే విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని బీఆర్ఎస్ ఎదురుచూస్తోందన్నారు. ఉచిత విద్యుత్తు పథకం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ధనంజయ, తాజుద్దీన్, మహమ్మద్ ఇస్మాయిల్, ఫెరోస్, నవాజ్, ఇమ్రాన్, ఖలీమ్, మునవర్, శేఖర్ యాదవ్, సంజయ్ యాదవ్, జనార్ధన్, జగన్, ప్రభాకర్, రాజు, చందు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement