Saturday, May 18, 2024

గొంతెత్తు ప్ర‌శ్నించు… ప్ర‌తిరోజూ మ‌న‌దే – క‌విత‌..

  • ‍‍జవాబు దొరికేవరకూ అన్యాయాలపై ప్రశ్నించాలి
  • ఆర్ధిక స్వావలంబనతోనే మహిళలకు మేలు
  • దళిత పారిశ్రామిక వేత్తలకు డిక్కీ ఊపిరి
  • సీఎం దృష్టికి తీసుకెళ్తా… టీఫ్రైడ్‌తో మరింత చేయూత
  • వుమెన్స్‌డే రోజున ఎమ్మెల్సీ కవిత బిజీబిజీ
  • డిక్కీ వుమెన్స్‌ డే వేడుకలు, వాణీదేవి తరపున ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సందేశం

మహిళా దినోత్సవాన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఆకర్షణగా మారారు. మహిళలకు ఒక్కరోజు కాదు.. 365 రోజులూ మనవే కావాలని ఉత్సాహపరుస్తూనే ఉదయం నుండి సాయంత్రం వరకు అలుపెరుగని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం తన నివాసంలో స్థానిక మహిళలతో కలిసి కేక్‌ కట్‌ చేసిన కవిత, ఆ తర్వాత డిక్కీ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం దూలపల్లి మహిళా క్యాంపస్‌లో కాలేజీ విద్యార్థినులు, అధ్యాపకురాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు. అటు తర్వాత అక్షర స్కూల్‌ విద్యార్థులతో జూమ్‌ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి కర్మన్‌ఘాట్‌ చంద్రగార్డెన్స్‌, జిల్లెలగూడ, బడంగ్‌పేటలలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భవిష్యత్తుపై మరింత ఉత్తేజం కలిగించారు. కవితోత్సాహం.. మహిళా దినోత్సవాన పరిమళించగా, కవిత ఉత్తేజపూరిత ప్రసంగాలకు వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు…

హైదరాబాద్‌, గొంతెత్తితే ఏడాదిలో ప్రతిరోజూ మహిళదే అవుతుందని, ఆర్థిక స్వావలంబనతో మహిళలకు నిర్ణయా ధికారం వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీ-ప్రైడ్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆర్థిక చేయూత అందిస్తోందని తెలిపారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో వివిధ కార్య క్రమాల్లో కవిత పాల్గొన్నారు. ముందుగా నగరం లోని ఓ హోటల్‌లో దళిత్‌ ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిం చారు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళలను ఈ సందర్భంగా కవిత సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డిక్కీ అనేక మంది దళిత పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తోందని కొనియాడారు. దళిత మహిళలపై కులవివక్ష ఇంకా కొనసాగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ప్రతి విషయంలో సమాజానికి ఆదర్శం గా నిలిచారని, దళితులు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిం చారని గుర్తుచేశారు. అనేక మంది దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి డిక్కీ కృషి చేస్తోందని అన్నారు. డిక్కీ సేవలను త్వరలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళతానని ఈ సందర్భంగా కవిత హామీ ఇచ్చారు. ప్రతి మహిళ ఉన్నత స్థితికి చేరుకుని మరో పది మంది మహిళలకు చేయూత నందించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రకరకాలుగా వివక్షకు గురవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలన్నారు. ఈ కార్యక్రమంలో డిక్కీ జాతీయ అధ్యక్షులు నర్రా రవికుమార్‌, డిక్కీ తెలంగాణ అధ్యక్షులు దాసరి అరుణ, దళిత స్త్రీ శక్తి కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి, బాలానగర్‌ డీసీపీ పద్మజ, సోమాజిగూడ కార్పొరేటర్‌ వనం సంగీత, పర్వాతా రోహకురాలు మాలావత్‌ పూర్ణ, పలువురు దళిత పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
జవాబు దొరికేదాకా అన్యాయాలపై ప్రశ్నించాలి
మహిళలంతా అన్యాయాలు, అసమానతలపై సమాధానం దొరికేవరకు ప్రశ్నించాలని కవిత పిలుపునిచ్చారు. -తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని దూలపల్లిలోని ఓ ఎడ్యు కేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన వేడుకలలో టీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవితో కలిసి కవిత పాల్గొని ప్రసంగించారు. మహిళలు గొంతెత్తితే ఏడాదిలో ప్రతిరోజు వారిదే అవుతుందని అన్నారు. స్త్రీలు, పురుషులు సమానమనే భావనతో రాజ్యాంగం అందరికీ ఓటుహక్కు కల్పించిందని అన్నారు. చాలామంది నారీమణుల పోరాటాల ఫలితాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయని తెలిపారు. అణచివేత, ఆంక్షల నుంచి బయటపడి ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్థాయికి మహిళలు ఎదిగారని అన్నారు. మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని కవిత పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రముఖ ఐటీ సంస్థల్లో 25 శాతం మంది ఉద్యోగులు మహిళలేనని గుర్తుచేశారు. బాలికల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పాఠశాలలను ప్రారంభించిందని చెప్పారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసే సంస్కృతి తెలంగాణలో తగ్గిందన్నారు. 18 ఏళ్లలోపు వివాహం చేసుకున్న వారికి కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయవద్దని సీఎం ఆదేశించారంటే ఆయన ఎంత సుదీర్ఘంగా ఆలోచిస్తారో తెలుస్తోందన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కవిత సూచించారు.
365 రోజులు మనవే కావాలి
ఒక్కరోజే కాదు.. 365 రోజులూ మనవే కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆత్మవిశ్వాసంతో అవకాశాలు సృష్టించుకుంటూ.. ప్రపంచమే పక్కకు తప్పుకుని మనకు దారిచ్చేలా ఎదగాలని సూచించారు. హైదరాబాద్‌ మేయర్‌, కార్పోరేటర్ల ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి ఆమె పాల్గొన్నారు.
జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న మహిళా అభ్యర్థి వాణిదేవిని మంచి మెజారిటీతో గెలిపించి మహిళల సత్తా చాటాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లా డుతూ మహిళల సంక్షేమానికి, భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నదన్నారు.
విద్యార్థుల ప్రశ్నలకు కవిత సమాధానాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్షర విద్యాసంస్థలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కవిత జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఆమె మహిళలకు సంబంధించిన అనేక విషయాలపై వారికి అవగాహన కల్పించారు. మహిళల హక్కులు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు కవిత ఓపిగ్గా సమాధానాలిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement